Begin typing your search above and press return to search.

పిల్ల మాస్కు తీసేసి.. ఫోటోల కక్కుర్తి ఏంది రాజయ్య..?

By:  Tupaki Desk   |   16 Jan 2022 11:50 AM IST
పిల్ల మాస్కు తీసేసి.. ఫోటోల కక్కుర్తి ఏంది రాజయ్య..?
X
ఏదో ఒక పని చేసి వార్తల్లో నిలుస్తుంటారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి కొలువు తీరిన కేసీఆర్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి.. మధ్యలోనే పెద్ద సారు ఆగ్రహానికి గురై.. పదవిని కోల్పోయిన ఆయనకు అప్పటి నుంచి బ్యాడ్ టైం నడుస్తోంది. రాజయ్య తీరు చూస్తే.. వివాదాల గూటికి వెళ్లి మరీ.. కెలికి చేతులు కాల్చుకోవటం కనిపిస్తుంటుంది.

తరచూ తన మాటలతోనో.. చేష్టలతోనో ఆయన వార్తగా మారటం కనిపిస్తూ ఉంటుంది. మనిషి మంచోడే కానీ.. చేసే చిలిపి పనులు ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. తానున్న స్థాయిని మరిచిపోయి.. ఆయన చేసే చేష్టలు ఆయన్ను అభిమానించేవారు సైతం తల పట్టుకునేలా చేస్తుందని చెబుతారు. అలాంటి రాజయ్య తీరు తరచూ వివాదాస్పదంగా మారుతుంటుంది.

తాజాగా తాను చేసిన పనికి వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలోనూ తిట్లు తింటున్నారు రాజయ్య. జరిగిందేమంటే.. సంక్రాంతి పండుగ సందర్భగా నిర్వహించిన ఒక కార్యక్రమానికి పెద్ద మనిషిగా వెళ్లిన ఆయన.. అందరితో కలుపుగోలుగా వ్యవహరించారు. ఇక్కడి వరకు ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. పనిలో పనిగా మీడియాకు ఇచ్చే ఫోటోల కోసం ఆయన చేసిన పని ఆయన్ను తప్పుపట్టేలా చేసింది.

ఒక చిన్నారిని ఎత్తుకున్న ఆయన.. ఫోటోలకు ఫోజులిచ్చారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఫోటోల్లో పాప ముఖం కనిపించకపోతే బాగుండదని అనుకున్నారేమో కానీ.. బుద్దిగా ముఖానికి పెట్టుకున్న మాస్కును తీసేసి మరీ.. ఫోటోలకు ఫోజులు ఇవ్వటాన్ని తప్పు పడుతున్నారు.

బాధ్యత కలిగిన ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇదేం తీరు? అని మండిపడుతున్నారు. మామూలు రోజుల్లో ఇలాంటివేమీ తప్పు కాదని.. మూడో వేవ్ ముంచుకొచ్చేసి.. పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్న వేళ.. ఫోటోల కోసం చిన్నారి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసేలా రాజయ్య వ్యవహరించారంటూ మండిపడుతున్నారు. ప్రచారం కోసం ఆయన చేసిన ప్రయత్నం మిస్ ఫైర్ కావటమే కాదు.. రివర్సులో ఆయనపై విమర్శల వర్షం కురిసేలా చేస్తోంది.