Begin typing your search above and press return to search.

'తెలంగాణలో 12 శాతం మాదిగలు.. కేబినెట్ లో ఒక్కరు లేరు'

By:  Tupaki Desk   |   9 Sep 2019 2:30 PM GMT
తెలంగాణలో 12 శాతం మాదిగలు.. కేబినెట్ లో ఒక్కరు లేరు
X
వేరే దారి లేనప్పుడు.. ఉన్నది ఒక్కటే మార్గమైనప్పుడు నచ్చినా.. నచ్చకున్నా.. మనసులో తిట్టుకుంటూనే నడుస్తుంటారు. కానీ.. కొత్త దారి వచ్చినప్పుడు.. మరిన్ని ఆప్షన్లు పెరిగినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో తాజాగా తెలంగాణ అధికార పక్షంలో సరిగ్గా ఇలాంటి పరిస్థితే నెలకొంది.

ఇటీవల పెద్దసారు మీద ఈటెల గుర్రుగా ఉన్న విషయాన్ని తన మాటల్లో చెప్పేయటం.. ఆ వెంటనే రసమయి బాలకిషన్ ఆ తరహాలోనే కొన్ని వ్యాఖ్యలు చేయటం.. యాదాద్రి గుడిలో శిల్పాల వివాదం.. ఈ సమయంలోనే విస్తరించిన కేబినెట్ లో గతానికి భిన్నంగా హరీశ్ కు ప్రాధాన్యత ఉన్న పదవి ఇవ్వటం లాంటివి చోటు చేసుకున్నాయి. ఇటీవల జరిగిన పరిణామాల్ని చూస్తే.. కేసీఆర్ ఆత్మరక్షణలో ఉన్నట్లుగా కనిపిస్తుంది.

సంచలన వ్యాఖ్యలు చేసే వారి విషయంలో ఆయన వ్యవహరిస్తున్న వైఖరి.. కొత్తగా ఉన్న అవకాశాల నేపథ్యంలో తాజాగా మరో నేత పెదవి విప్పారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించి.. మధ్యలో కేసీఆర్ ఆగ్రహానికి గురై పదవిని పోగొట్టుకున్న రాజయ్య తాజాగా తన అసంతృప్తిని అస్సలు దాచుకోలేదు.

తెలంగాణ రాష్ట్రంలో 11 నుంచి 12 శాతం మంది మాదిగలు ఉంటే.. ఏపీలో అదే స్థాయిలో మాలలు ఉన్నారన్నారు. అయితే.. తెలంగాణ కేబినెట్ లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరు కూడా లేరన్నారు. మాదిగల గురించి ఎవరో ఒకరు మాట్లాడాలని.. విపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తారన్న రాజయ్య మాటలు చూస్తే.. టీఆర్ఎస్ లోని మాదిగ నేతలకు రాజయ్య సంకేతాలు ఇస్తున్నారా? అన్న భావన కలగటం ఖాయం. తాజా పరిణామాలు చూస్తుంటే.. రానున్న రోజుల్లో కేసీఆర్ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోనున్నారా? అన్న సందేహం కలుగక మానదు.