Begin typing your search above and press return to search.

ఎన్నికలుంటేనే నిధులిస్తారా?: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   5 Oct 2021 12:03 PM IST
ఎన్నికలుంటేనే నిధులిస్తారా?: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X
సాధారణంగా అధికార పార్టీలో ఉన్నవారు ఎవరూ నోరెత్తరు. నిధులుఇచ్చినా ఇవ్వకున్నా.. సీఎం కలిసినా కలవకున్నా.. అభివృద్ధి జరగకున్నా కిక్కురుమనకుండా ఉంటారు. కానీ ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాత్రం బయటపడ్డాడు. తాజాగా ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్వపక్షంలోనే ధిక్కార స్వరం వినిపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై ఎమ్మెల్యే రేగా కాంతారావు ధైర్యం చేసి మాట్లాడారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడిన స్పీచ్ వైరల్ అయ్యింది.

తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు మున్సిపాలిటీల్లో అధ్వాన పరిస్థితి ఉందని.. పారిశుధ్యం పడకేసిందని.. కార్మికులు పనిచేయడం లేదని వాపోయారు. ఎన్నికలు ఉన్న చోటే ప్రభుత్వం నిధులను ఖర్చు చేస్తోందని మండిపడ్డారు.

భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలకు ప్రభుత్వం సరైన నిధులను మంజూరు చేయడం లేదని అన్నారు. హుజూరాబాద్ బైపోల్.. ఇతర చోట్ల ఎన్నిక ఉంటేనే నిధులు మంజూరు అవుతున్నాయని కామెంట్ చేశారు.

పినపాక నియోజకవర్గంలో ఎన్నికలు లేకపోవడంతో అక్కడ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాలను కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తన ప్రశ్నలకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని కోరారు.

అధికార పార్టీలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు కామెంట్స్ కలకలం రేపాయి. దీనిపై అధికార పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. ఇక నెటిజన్లు ఈ వీడియోను వైరల్ చేస్తూ టీఆర్ఎస్ పై విమర్శలు సంధిస్తున్నారు.