Begin typing your search above and press return to search.

అధికార పార్టీ ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   24 Jun 2016 2:02 PM GMT
అధికార పార్టీ ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే
X
జిల్లాల ఏర్పాటు తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయ క‌ల‌క‌లానికి దారితీస్తోంది. ముఖ్యంగా అధికార టీఆర్ ఎస్ పార్టీలో అసంతృప్త జ్వాల‌లు ఏకంగా బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేసే స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా వ‌రంగ‌ల్ జిల్లాలో ఈ త‌ర‌హాలో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే ట్రెండ్ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం వ‌రంగ‌ల్ జిల్లాలో ఉన్న జనగామ విష‌యంలో ఈ ట్రెండ్ సాగుతోంది.

జ‌న‌గామ‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ ఆ ప్రాంత వాసులు చేస్తున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా జనగామ వాసులు చేస్తున్న ఆందోళనలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇదే అంశం అధికార టీఆర్ ఎస్‌ లోని ఇద్దరి నేతల మద్య తీవ్ర విభేదాలను సృష్టిస్తోంది. జిల్లాల పునర్విభజనకు సంబందించి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిదిలోనే యాదాద్రి - జనగామ ఉన్నాయి. ఇందులో భువనగిరి కేంద్రంగా యాదాద్రి జిల్లాను ఏర్పాటు చేసేందుకు సర్కార్ సుముఖంగా ఉంది. కలెక్టర్ల సమావేశంలోనే ఈ ఇదే అంశంపై క్లారిటీ వచ్చింది. దీంతో ఆగ్రహించిన అక్కడి నేతలు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వైఖరి వల్లే జనగామకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముత్తిరెడ్డి ఇంటిముందు చావుడప్పు కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న ఎమ్మెల్యే ఆందోళనకారులనుద్దేశించి మాట్లాడుతూ స్థానిక ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వైఖరి వల్లే జనగామకు అన్యాయం జరుగుతుందని అన్నారు. భువనగిరిని జిల్లా చేసేందుకు సీఎం సుముఖంగా ఉన్నారని ముత్తిరెడ్డి తెలిపారు. అయితే ఎంపీ బూర న‌ర్స‌య్య రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కూడ తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరిని కావాలనే చివరి క్షణంలో ఎంపీ తెరమీదకు తీసుకు వచ్చారని ఎమ్మెల్యే ఆరోపించారు. గ‌తంతో ఎంపీ నిధుల వినియోగంలో కూడ జనగామకు అన్యాయం చేస్తున్నారని యాదగిరిరెడ్డి మండిపడ్డారు.

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. జనగామను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌ కు తన మద్దతు ఉందని స్పష్టం చేశారు. కావాలనే ఎమ్మెల్యే ఉద్యమకారులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వైఖరిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని కూడ హెచ్చరించారు. ఓ వైపు ఎమ్మెల్యే - మరో వైపు ఎంపీల వ్యాఖ్యలతో జనగామ జిల్లా డిమాండ్ కంటే ఇద్దరి మద్య విభేదాలు ఇపుడు హాట్ టాపిక్‌ గా మారింది.