Begin typing your search above and press return to search.

పెండింగ్ చలాన్లు క్లియర్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఎంత మొత్తమో తెలుసా?

By:  Tupaki Desk   |   21 Jun 2022 1:30 AM GMT
పెండింగ్ చలాన్లు క్లియర్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఎంత మొత్తమో తెలుసా?
X
మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన వాహనాలపై ఉన్న అన్ని పెండింగ్ చలాన్లను క్రియర్ చేశారు. మొత్తం 5 వాహనాలకు సంబంధించి 66 చలాన్లు పడగా.. మొత్తం రూ.37365 దానం చెల్లించారు. ఇక ఇందులో తొలుత వార్తల్లోకెక్కిన టీఎస్09 ఎఫ్ఏ 0999 కారుపై ఉన్న 8 చలాన్లకు సంబంధించి నమోదైన రూ.5175 కూడా ఉంది. ఈ మేరకు బంజారాహిల్స్ సీఐ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇటీవల రిజిస్ట్రేషన్ లేని వాహనాలు, బ్లాక్ ఫిల్మ్ పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దీనిలో భాగంగా శనివారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం కారు అటుగా వచ్చింది. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాహనం అని చెప్పగానే దాన్ని పోలీసులు వదిలేశారు.

ఈ క్రమంలోనే కారుపై రూ.5వేల చలాన్లు ఉన్నా కూడా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. అధికార పార్టీ నేతలకు ట్రాఫిక్ పోలీసులు కొమ్ముకాస్తున్నారంటూ ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

ఆరోపణలతో ఆదివారం దానం నాగేందర్ తన వాహనాలపై ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేశారు. ఆదివారం ఒక్కరోజే ట్రాఫిక్ పోలీసులు 1745 వాహనాలపై చలాన్లు విధించారు.

వీటిలో ద్విచక్ర వాహనాలు 943, త్రిచక్ర వాహనాలు 108, తేలికపాటి వాహనాలు 688 ఉన్నాయి. మిగిలినవి ఇతర రకాలకు చెందిన వాహనాలు. వాహనాలను ఆపుతున్న ట్రాఫిక్ విభాగం అధికారులు తమ వద్ద ఉన్న ట్యాబ్స్ ద్వారా డేటాబేస్ లో వాటి రిజిస్ట్రేషన్ల నంబర్లను సెర్చ్ చేస్తున్నారు.

ఇలా చేస్తున్నప్పుడు ఆ వాహనంపై పెండింగ్ చలాన్లు ఉంటే ఆ విషయం ట్రాఫిక్ పోలీసులకు తెలుస్తోంది. సదురు వాహనచోదకుడు ఆ మొత్తం క్లియర్ చేసే వరకూ వాహనాన్ని లేదా ధ్రువీకరణ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.