Begin typing your search above and press return to search.

కారు నుంచి జంపింగ్స్ ఉంటాయంటూ షాకిచ్చాడు

By:  Tupaki Desk   |   24 Jun 2016 9:36 AM GMT
కారు నుంచి జంపింగ్స్ ఉంటాయంటూ షాకిచ్చాడు
X
తనదైన శైలిలో ఆపరేషన్ ఆకర్ష్ ఆస్త్రాన్ని సంధిస్తూ.. తన వైరి వర్గాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎలా పావులు కదుపుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన జోరుకు విపక్షాలు హాహాకారాలు చేస్తున్న పరిస్థితి. ఆయన జోరుకు బ్రేకులు ఎలా వేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న వారికి తక్కేవం లేదు.

కొమ్ములు తిరిగిన నేతలుగా పేరొందిన వారు సైతం కిమ్మనకుండా.. కేసీఆర్ తీరును లోగుట్టుగా తిట్టుకోవటం కనిపిస్తుంది. ఇదే మాటను బహిరంగంగా చెప్పొచ్చుగా అని అలాంటి నేతల్ని ఎవరైనా ప్రశ్నిస్తే.. కేసీఆర్ తో పెట్టుకుంటే ఇంకేమైనా ఉంటుందా? అంటూ చెప్పుకోవటం కనిపిస్తోంది. ఇలాంటి వేళ బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ఎన్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ సర్కారులోని కొందరు కీలక మంత్రులు కారును వదిలేసి బీజేపీలో చేరనున్నట్లుగా ప్రకటించారు. అయితే.. ఎవరు కారు నుంచి జంప్ కానున్న విషయాన్ని తాను చెప్పలేనంటూ ఆయన చెబుతున్నారు. సమయం వచ్చినప్పుడు కారు నుంచి జంప్ అయ్యే నేతల వివరాల్ని చెబుతానని చెబుతున్న ప్రభాకర్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా మారాయి.