Begin typing your search above and press return to search.

కేసీఆరే కాదు.. మంత్రులు కూడా రావ‌ట్లేదు

By:  Tupaki Desk   |   6 Aug 2017 9:26 AM GMT
కేసీఆరే కాదు.. మంత్రులు కూడా రావ‌ట్లేదు
X
ఒక రాష్ట్రంలో ప్ర‌భుత్వ పాల‌న‌కు గుండెకాయ లాంటిది సెక్ర‌టేరియ‌ట్‌. స‌చివాల‌యం ఎంత చురుగ్గా ఉంటుందో.. దానికి త‌గ్గ‌ట్లే పాల‌నా యంత్రాంగం ప‌రుగులు పెడుతుంది. మ‌రి.. కొత్త‌గా ఏర్ప‌డి.. బంగారు తెలంగాణ దిశ‌గా ప‌రుగులు పెడుతున్నామ‌ని చెప్పే తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు హ‌యాంలో స‌చివాల‌యం ఎలాఉందో చూస్తే షాక్ తినాల్సిందే.

స‌చివాల‌యం అన్న వెంట‌నే నేత‌లు.. వారి కోసం వ‌చ్చే అనుచ‌ర‌గ‌ణం.. అధికారులు ఇలా నిత్యం క‌ళ‌క‌ళ‌లాడే తీరుకు భిన్న‌మైన ప‌రిస్థితి తెలంగాణ రాష్ట్ర స‌చివాల‌యంలో నెల‌కొని ఉంద‌ని చెబుతున్నారు. పాల‌నాప‌ర‌మైన విష‌యాల‌కు సంబంధించి నిర్ణ‌యాలు తీసుకోవ‌టానికి వీలుగా నిత్యం స‌చివాల‌యానికి రావాల్సిన మంత్రుల్లో చాలామంది రావ‌ట్లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఆ మాట‌కు వ‌స్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అయితే స‌చివాల‌యం వైపు క‌న్నెత్తి చూడ‌ని వైనం తెలిసిందే. అయితే.. తాను ముచ్చ‌ట‌ప‌డి క‌ట్టించుకున్న సీఎం క్యాంప్ ఆఫీసులో త‌ప్పించి.. స‌చివాల‌యానికి దాదాపుగా రావ‌టం మానేసిన వైనం తెలిసిందే. తాను క‌ట్టించాల‌ని అనుకుంటున్న సచివాల‌యం క‌ట్టించుకునే వ‌ర‌కూ ఆయ‌న వెళ్లేట‌ట్లుగా క‌నిపించ‌టం లేద‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్ తీరులోనే మిగిలిన మంత్రులు న‌డుస్తున్నార‌ని చెబుతున్నారు. సీఎం రాని స‌చివాల‌యానికి మంత్రులు మాత్రం ఎందుకు వ‌స్తారు? అందుకు త‌గ్గ‌ట్లే మొత్తంగా ఉన్న 17 మంది మంత్రుల్లో స‌గానికి కంటే త‌క్కువ మంది మాత్రమే నిత్యం స‌చివాల‌యానికి వ‌స్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

దీనికి మిన‌హాయింపుగా ముగ్గురు మంత్రుల పేర్లు చెబుతారు. వారిలో ఒక‌రు ఉప ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ అలీ అయితే.. మ‌రో ఇద్ద‌రు మంత్రుల్లో ఒక‌రు నాయిని న‌ర్సింహారెడ్డి.. మ‌రొక‌రు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ లుగా చెప్పాలి. అంద‌రిలోకి త‌ల‌సాని త‌ర్వాతే ఎవ‌రైనా అని చెప్ప‌క త‌ప్ప‌దు. విడిరోజుల్లోనే కాదు.. సెలవు రోజుల్లోనూ త‌ల‌సాని ఒక్క‌సారి అయినా స‌చివాల‌యానికి వ‌చ్చి.. కాసేపు గ‌డిపిన త‌ర్వాత వెళ‌తార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

చాలామంది మంత్రులు స‌చివాల‌యానికి రావ‌టానికి కూడా పెద్ద‌గా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌క‌పోవ‌టం క‌నిపిస్తుంది. మంత్రులంతా సొంత నియోజ‌క‌వ‌ర్గాల మీద దృష్టి పెట్ట‌టం.. మ‌రో రెండేళ్ల‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మంత్రులు ప‌లువురు తాము ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల మీద దృస్టి పెట్ట‌టంతో హైద‌రాబాద్ కు కూడా రావ‌ట్లేద‌ని చెబుతున్నారు.

మ‌రోవైపు ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం వివిధ ర‌కాల స‌ర్వేలు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. త‌న దృష్టికి వ‌స్తున్న నివేదిక‌ల్ని విశ్లేషించి.. గెలుపు ఓట‌ముల‌పై త‌న స‌న్నిహితుల‌కు హిత‌బోధ చేస్తున్న‌ట్లుగా స‌మాచారం. మంత్రుల్లో ఎక్కువ మంది స‌చివాల‌యానికి రాకుండా ఉండ‌టంతో.. సంద‌ర్శ‌కుల‌ సంఖ్య కూడా రోజురోజుకి త‌గ్గిపోతున్న‌ట్లుగా చెబుతున్నారు. కొంద‌రు మంత్రులు స‌చివాల‌యానికి వ‌స్తున్న‌ప్ప‌టికీ.. ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద వ‌స్తున్న సంద‌ర్శకుల తాకిడికి వేరే మంత్రుల ఛాంబ‌ర్ల‌లో కాల‌క్షేపం చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. వాస్త‌వ ప‌రిస్థితి మీద అవ‌గాహ‌న లేని ప‌లువురు సంద‌ర్శ‌కులు.. స‌చివాల‌యానికి నేరుగా వ‌చ్చి.. బోసిపోతున్న ప‌రిస‌రాల్ని చూసి అవాక్కు అవుతున్నారు. రాష్ట్ర పాల‌న‌కు గుండెలాంటి స‌చివాల‌యానికి ఈ గైర్హాజ‌రీ ఫివ‌ర్ ఏంద‌న్న ప్ర‌శ్న‌కు సూటిగా స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు. సీఎమ్మేకే ప‌ట్ట‌ని స‌చివాల‌యం మంత్రుల‌కు మాత్రం ప‌డుతుందా?