Begin typing your search above and press return to search.

వారు తెస్తే మీరు ఏలుతారా హరీశ్? అవే మాటలు చెప్పేందుకు బోర్ కొట్టదా?

By:  Tupaki Desk   |   24 Aug 2021 3:30 AM GMT
వారు తెస్తే మీరు ఏలుతారా హరీశ్? అవే మాటలు చెప్పేందుకు బోర్ కొట్టదా?
X
చెప్పిందే చెప్పి.. బోర్ కొట్టించటం ఈ మధ్యన టీఆర్ఎస్ నేతలకు బాగా అలవాటైంది. ఉద్యమ కాలంలో మిగిలిన పార్టీలకు భిన్నంగా మాట్లాడి అందరిని ఆకర్షించిన గులాబీ నేతల మాటలు గడిచిన కొన్ని సంవత్సరాలుగా అదే పనిగా విని.. విని బోర్ కొట్టేసిన పరిస్థితి. దమ్ముంటే తెలంగాణ తీసుకురండి అంటూ అప్పట్లో కాంగ్రెస్ నేతలకు టార్గెట్ ఇచ్చి మరీ తెచ్చిన తర్వాత ఏమైంది? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆచూకీనే ప్రశ్నార్థకమైంది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి నిధులు.. ప్రాజెక్టులు తీసుకురావాలంటూ టార్గెట్లు పెట్టేస్తున్నారు గులాబీ నేతలు.

ఆరు..సారు.. పదహారు అంటూ సార్వత్రిక ఎన్నికల్లో మాటలు చెప్పి.. జస్ట్ 16 సీట్లు ఇవ్వండి.. దేశంలోనే చక్రం తిప్పుతామని భారీగా ప్రచారం చేస్తూ గొప్పలు చెప్పుకున్న మాటల్ని మర్చిపోయారా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. పదహారు సీట్లను ఇస్తే చాలు.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని చెప్పిన మాటలకు.. తర్వాత జరిగిందేమిటో తెలిసిందే? పదహారు సీట్లతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పటం ఎంత కష్టమైనదన్న విషయం తెలియంది కాదు. పదహారు సీట్లతోనే చక్రం తిప్పాలన్న ఆలోచన కేంద్రంలో కొలువు తీరే వారిని అప్రమత్తం అయ్యేలా చేస్తుందన్నది మర్చిపోకూడదు.

అలాంటప్పుడు.. తమకు ప్రత్యర్థిగా ఎదిగే పార్టీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రానికి నిధులు.. ప్రాజెక్టులు ఎందుకు ఇస్తారు? ఆ మాటకు వస్తే.. కేసీఆర్.. కేటీఆర్.. హరీశ్ లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు.. వారు దత్తత తీసుకున్న ఊళ్లు ఎలా వెలిగిపోతున్నాయి.. విపక్షాలు గెలిచిన నియోజకవర్గాలు ఎంతలా బోరుమంటున్నాయో తెలియంది కాదు. అలాంటప్పుడు బీజేపీ నేతల్ని డిమాండ్ చేసే హరీశ్ రావు లాంటివారు.. రాష్ట్రంలో తమ ప్రత్యర్థి పార్టీల నేతలు ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలకు ఎంత ఇస్తున్నారో లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది.

బ్యాడ్ లక్ ఏమంటే.. నిధులు.. ప్రాజెక్టులు కేంద్రం నుంచి తీసుకురమ్మని చెప్పిన వెంటనే.. విపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు మీరెంత నిధులు ఇచ్చారు? మీరేం పథకాల్ని అమలు చేస్తున్నారన్న కనీస ప్రశ్నను సంధిస్తే బాగుండేది. కానీ.. ఇదేమీ కనిపించదు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి.. ఎవరో ఏదో ఇవ్వాలి. ఇచ్చినోళ్లు అడ్రస్ లేకుండా పోవాలి. అంతా తామై ఏలాలన్న మైండ్ సెట్ మొదట్లో అర్థం కాకున్నా.. ఏడున్నరేళ్ల పాలన తర్వాత అయినా అర్థం కాకుండా ఉంటుందా చెప్పండి హరీశ్ అన్న మాటలు పలువురి నోట వినిపిస్తున్నాయి. చెప్పిందే చెప్పటానికి హరీశ్ లాంటి వారికి బోర్ కొట్టకున్నా.. వినే వారికి మాత్రం.. ఆ వ్యూహాన్ని కాస్త మార్చరా? అన్న విసుగు మాత్రం వినిపిస్తోంది.