Begin typing your search above and press return to search.

తెలంగాణలో వరద నీటి వెనుక సైన్స్ ఏంటో చెప్పిన మంత్రి గారు!

By:  Tupaki Desk   |   7 Sep 2021 5:30 PM GMT
తెలంగాణలో వరద నీటి వెనుక సైన్స్ ఏంటో చెప్పిన మంత్రి గారు!
X
తెలంగాణలో గత వారం రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కరీంనగర్ టౌన్, పరిసర లోతట్టు ప్రాంతాలు, కరీంనగర్ చుట్టు పక్కల ఉన్న పల్లెల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో, వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. రోడ్డు పనులు నడుస్తున్నందున కొన్ని ప్రాంతాల్లో వరద నీరు నిలిచిందని, మున్సిపల్ సిబ్బంది మెదలు, రెవెన్యూ, ఇరిగేషన్, వాటర్ వర్క్స్, పోలీస్ శాఖలతో సహా అధికార యంత్రాంగం అంతా నీటిని తరలించేందుకు కష్టపడుతున్నారని చెప్పారు.

ఇంతవరకు బాగానే ఉంది. అయితే, కరీంనగర్ లో ఇలా వరదనీరు చేరడానికి తమ ప్రభుత్వ పాలనే కారణమంటూ గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేసీఆర్ సీఎం కాక ముందు గ్రౌండ్ వాటర్ ఎక్కువగా లేదని, అందుకే వర్షాలు పడ్డప్పుడల్లా ఆ నీరు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలుగా మారేవని వరదల వెనుకున్న సైన్స్ ను గంగుల కమలాకర్ చెప్పారంటూ ట్రోలింగ్ జరుగుతోంది.

అంతేకాదు, కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల గత సీజన్ నుండి అన్ని జలాశయాలు నిండు కుండల్లా మారి భూగర్భ జలాల నిల్వలు భారీగా పెరిగాయని, దీంతో, చిన్న వర్షం పడ్డా...ఆ నీరు వరదగా మారి నగరంలోకి వస్తోందని వెల్లడించారు. మానేరు జలాశయం నిండి గేట్లు తెరిచామని, కాబట్టి నీరు భూమిలోకి పోలేక ఇలా నగరాలు, పల్లెల్లోకి చేరుకుంటోందని సెలవిచ్చారు. ఇక, ప్రకృతి విపత్తులు చెప్పి రావని, అవి వచ్చినపుడు ప్రభుత్వం కూడా వాటిని ఆపలేదని షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రజలకు కలుగుతున్న ఇబ్బందుల్ని పరిష్కరిస్తామని, వర్షాకాలంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కమలాకర్ చెప్పడం కొసమెరుపు.

అయితే, వాస్తవానికి తెలంగాణలోని హైదరాబాద్ తోపాటు పలు నగరాలలో చెరువులు, నాలాలు కబ్జాలకు గురయ్యాయని, అందుకే వరదనీటికి దారి లేక ఇళ్ల మధ్యలోకి చేరుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వరద నీరు వెళ్లేందుకు సరైన ప్రణాళికలు రూపొందించే బాధ్యత ప్రభుత్వానిదేనని, అది నిర్వర్తించకుండా...ఇలా వరదల వెనుక కొత్త సైన్స్ చెప్పి జ్ఞానబోధ చేయడం ఏమిటని పంచ్ లు వేస్తున్నారు. తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు అభివృద్ధి అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు.