Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ప్రభంజనం

By:  Tupaki Desk   |   3 Jun 2019 12:18 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ప్రభంజనం
X
మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు టీఆర్ ఎస్ కు కోలుకోలేని షాక్ ఇస్తే..ఇప్పుడు స్థానికసంస్థల ఎన్నికలు మాత్రం గులాబీ పార్టీకి ఊరటనిచ్చాయి. ఆ ఓటములను మరిచిపోయేలా చేశాయి. కాసింత కోలుకునేలా చేశాయి. కాంగ్రెస్, బీజేపీల విజయాలను మరిపించేలా చేశాయి.

తాజాగా తెలంగాణలో జరిగిన మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో మూడు స్థానాల్లోనూ టీఆర్ ఎస్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేయడం విశేషం.

పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్, కేటీఆర్ లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు చేజారకుండా పకడ్బందీగా ముందుకెళ్లారు. ఓటింగ్ పై అవగాహన కల్పించారు. దీంతో ఆ ఫలితం కనపడింది. మూడు చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీట్లను టీఆర్ ఎస్ కైవసం చేసుకుంది.

*కోమటిరెడ్డికి మొన్న గెలుపు.. నేడు నల్గొండలో ఓటమి..
పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా గెలిచారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆ గెలుపు ధీమా పోకముందే ఓటమి ఎదురైంది. నల్లగొండలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. గతంలో రాజగోపాల్ రెడ్డి గెలిచిన ఈ సీటులో ఆయన ఎమ్మెల్యే కావడంతో రాజీనామా చేశారు. ఆయన ప్లేసులో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరుఫున కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి కోమటిరెడ్డి లక్ష్మీని నిలబెట్టారు. అయితే ఆమె టీఆర్ఎస్ అభ్యర్థి చిన్నపరెడ్డి చేతిలో ఓడిపోయారు. చిన్నపరెడ్డికి 600ఓట్లు రాగా.. కోమటిరెడ్డి లక్ష్మికి 391 ఓట్లు మాత్రమే వచ్చి ఓడిపోయారు..మంత్రి జగదీశ్ రెడ్డి దగ్గరుండి మరీ టీఆర్ఎస్ విజయంలో కీలక పాత్ర పోషించారు..

*రంగారెడ్డిలో మహేందర్ రెడ్డి జయకేతనం..
ఇక తాండూర్ అసెంబ్లీకి పోటీచేసి మొన్నటి డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గట్టి పోటీనిచ్చినా ఆయనను ఓడించాడు. మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఎంత ప్రయత్నం చేసినా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించలేకపోయారు.

*ఓరుగల్లులో టీఆర్ ఎస్ కు ఫుల్ మెజారిటీ
వరంగల్ స్తానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అఖండ మెజార్టీతో గెలిచారు. కేటీఆర్ కు సన్నిహితుడైన పోచంపల్లి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని చిత్తుగా ఓడించాడు. టీఆర్ ఎస్ అభ్యర్థికి 850ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 23ఓట్లు మాత్రమే రావడం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థులందరూ టీఆర్ఎస్ లో చేరిపోవడంతో కాంగ్రెస్ కు ఈ దారుణ ఓటమి ఎదురైంది.