Begin typing your search above and press return to search.

షర్మిల క్యారవాన్ ను తగలబెట్టే యత్నం.. త్రుటిలో తప్పిన ప్రమాదం

By:  Tupaki Desk   |   28 Nov 2022 10:32 AM GMT
షర్మిల క్యారవాన్ ను తగలబెట్టే యత్నం.. త్రుటిలో తప్పిన ప్రమాదం
X
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలకు అనూహ్య పరిస్థితులు ఎదురయ్యాయి. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈ రోజు (సోమవారం) 3500 కి.మీ. పూర్తి కానున్న విషయం తెలిసిందే.

తన పాదయాత్రలో భాగంగా అధికార టీఆర్ఎస్ తో పాటు విపక్ష బీజేపీ.. కాంగ్రెస్ ల మీద ఆమె తీవ్ర స్వరంగా విరుచుకుపడటం.. రోజువారీగా సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

సుదీర్ఘకాలంగా సాగుతున్న పాదయాత్ర మైలురాయిగా నిలుస్తుందని చెప్పే వేళలో.. ఆమె పాదయాత్రను అడ్డుకునేందుకు అధికార టీఆర్ఎస్ కు చెందిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడటం గమనార్హం.తాను పాదయాత్ర చేసే ప్రతి చోట.. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి గురించి సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీదా ఆయన కుమారుడు.. కుమార్తెల మీద ఆమె ఘాటు విమర్శలు.. పదునైన ఆరోపణలు చేస్తున్నారు.

తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో జరుగుతున్న పాదయాత్ర సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీద ఘాటు ఆరోపణలు చేశారు. పేరులోనే పెద్దరికం ఉంది తప్పించి విడిగా ఎమ్మెల్యే తీరు ఏ మాత్రంసరిగా లేదని షర్మిల మండిపడుతున్నారు.

దీంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ సానుభూతిపరులు ఆమె ప్రయాణించే క్యారవాన్ మీద దాడి చేసి.. నిప్పు అంటించారు. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలు పెద్దగా రేగకుండానే వాటిని ఆర్పేశారు. దీంతో.. పెను ప్రమాదం త్రుటిలో తప్పిందన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.