Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ లో ‘రెబల్’ స్టార్ అవుతోన్న మాజీ మంత్రి

By:  Tupaki Desk   |   18 Jun 2020 3:00 PM GMT
టీఆర్ ఎస్ లో ‘రెబల్’ స్టార్ అవుతోన్న మాజీ మంత్రి
X
తొలి కేబినెట్ లో మంత్రి పదవి దక్కి.. ఈసారి దక్కకపోయిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఇప్పుడు గులాబీ పార్టీలో రగిలిపోతున్నారట.. తన చుట్టూ సొంత టీఆర్ఎస్ పార్టీ నేతలే గోతులు తవ్వుతున్నారంటూ నిప్పులు చెరుగుతున్నారట..

ఇప్పటికే తనకు దక్కాల్సిన మంత్రి పదవిని సీఎం కేసీఆర్.. కరీంనగర్ ఎమ్మెల్యే బీసీ అయిన గంగుల కమలాకర్ కు ఇవ్వడంతో అలకబూనిన జోగురామన్న అప్పటినుంచే ఎవరినీ ఖాతరు చేయడం లేదన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, సహా ఎవరినీ పట్టించుకోవడం లేదట.. సొంత ఏజెండాతో ముందుకెళ్తున్నారట.. నాలుగోసారి గెలిచిన తన పట్ల, కొందరు తిరుగుబాటు చేస్తున్నారని మండిపడుతున్నారట..

ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లోనూ తన కుమారుడు ప్రేమేందర్ కు ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ దక్కకుండా కుట్రలు చేసిన గులాబీ నేతలపై కారాలు మిరియాలు నూరుతున్నారు. సొంత టీఆర్ఎస్ పార్టీ నేతలనే ఓడించి కుమారుడికి దక్కేలా చేసుకున్నారు.

ఇక డీసీసీబీ చైర్మన్ ఎన్నికల సందర్భంలోనూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో మాజీ మంత్రి జోగురామన్న వార్ నడిచింది. డీసీసీబీ చైర్మన్ గా మంత్రి ప్రతిపాదించిన వ్యక్తిని కాదని.. మరో వ్యక్తికి కట్టబెట్టారు జోగురామన్న. దీంతో జోగుపై పార్టీ నేతల్లో అసమ్మతి మొదలైంది.

ఆదిలాబాద్ లోనే కాదు.. పక్కనున్న బోథ్ నియోజకవర్గంలోనూ అసమ్మతి చిచ్చు రేగింది. మాజీ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ నేతల కొట్లాటలు పీక్ స్టేజికి చేరాయట.. విభేదాలతో గెలావాల్సిన సీట్లను ఓడిపోతున్నామని.. గొడవలు మానకపోతే తీవ్ర పరిణామాలుంటాయని అధిష్టానం హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది.