Begin typing your search above and press return to search.

టీఆరెస్ వర్సెస్ ఐఏఎస్

By:  Tupaki Desk   |   13 July 2017 9:18 AM GMT
టీఆరెస్ వర్సెస్ ఐఏఎస్
X
తెలంగాణలో టీఆరెస్ నేతలు - ఐఏఎస్ ల మధ్య సమన్వయం చెడుతోంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు - కలెక్టర్లు ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్లుగా తయారైంది. నేతల వైఖరే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అధికారులపై ఆధిపత్యం చెలాయించాలని చూడడం, అధికారుల విధులకు అడ్డుపడడం... తాము చెప్పినట్లే వినాలని ఒత్తిడి చేయడంతో పాటు అక్కడక్కడా ఎమ్మెల్యే శంకర్ నాయక్ తరహా వ్యవహార శైలి కూడా వివాదాలకు కారణమవుతోంది. సుమారు 10 జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది.

తాజాగా మహబూబాబాద్ జిల్లాలో అక్కడి కలెక్టర్ తో ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యవహరించిన తీరుపై ఐఏఎస్ అధికారుల సంఘంతో పాటు సీఎం కేసీఆర్ కూడా మండిపడుతున్నారు. మంత్రులు రంగంలోకి దిగి ఎమ్మెల్యేతో క్ష‌మాప‌ణ‌లు చెప్పించినా కూడా క‌లెక్ట‌ర్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదంటే ఎమ్మెల్యే తీరుతో ఆమె ఎంతగా ఆవేదన చెందారో.. ఎంతగా విసుగు చెందారో అర్థమవుతుంది. ఎమ్మెల్యేపై కేసు పెట్టాల‌ని ఎస్పీపై కలెక్టర్ ఒత్తిడి తేవడంతో పార్టీ ప‌రువు పోతోంద‌ని గ్ర‌హించిన మంత్రులు క‌లెక్ట‌ర్‌ ను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.

అయితే.. ఈ ఒక్క ఘటనే కాదు ఇటీవల కాలంలో ఇలాంటివి మరిన్ని జిల్లాల్లో జరిగాయి. జ‌న‌గామ‌లో క‌లెక్ట‌ర్ దేవ‌సేన‌,ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి మ‌ధ్య కొంతకాలం మాట‌ల‌యుద్ధం న‌డిచింది.

* అలాగే వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్ ఆమ్ర‌పాలిపై ఆ జిల్లా నేత‌లు సీఎంకు ఫిర్యాదులు చేశారు. ఆమె త‌మ మాట‌ వినడం లేదన్నది అక్కడి నేతల ఫిర్యాదు.

* నిజామాబాద్ క‌లెక్ట‌ర్ యోగితారాణాను బ‌దిలీ చేయాల‌ని ఆ జిల్లా మంత్రులు,ఎమ్మెల్యేలు ఎప్ప‌టినుంచో సీఎంపై ఒత్తిడి తెస్తున్నారు. ముక్కుసూటిగా వ్య‌వ‌హరించే ఆమెతో త‌మ‌కు ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని చెప్పార‌ట‌.

* పెద్ద‌ప‌ల్లి క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేసిన అలుగు వ‌ర్షిణి టీఆర్ఎస్ నేత‌ల ఇంటికి అధికారులు వెళ్లకూడ‌ద‌ని... ఏమైనా ప‌ని ఉంటే వారిని ఆఫీసుకు పిలిచి మాట్లాడాలని సూచించినట్లు సమాచారం. ఇసుక దందాలను ఆమె సాగనివ్వకపోవడంతో టీఆరెస్ నేతలకు ఆమెకు పొసగడం లేదు. * కరీంన‌గ‌ర్ క‌లెక్ట‌ర్ స‌ర్ప‌రాజ్ ఆహ్మ‌ద్‌ తో ప్రొటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌ - గంగుల క‌మ‌లాక‌ర్ వాగ్వావాదానికి దిగారు. అప్ప‌టి నుంచి ఆజిల్లాల్లో జరిగే కార్యక్రమాల సమాచారాన్ని క‌లెక్ట‌ర్‌ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు అందించడం మానేశారు.

* ఎక్కువగా మహిళా కలెక్టర్లు ఉన్న చోట వివాదాలు తలెత్తుతున్నాయి.