Begin typing your search above and press return to search.

జగిత్యాలలో బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత...హై టెన్షన్

By:  Tupaki Desk   |   25 Dec 2020 2:02 PM GMT
జగిత్యాలలో బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత...హై టెన్షన్
X
ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వెర్బల్ వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం ఉన్న బీజేపీ....అధికార టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటోంది. ముఖ్యంగా, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కరీం నగర్ ఎంపీ బండి సంజయ్ పగ్గాలు చేపట్టిన తర్వాత కమనాథులు కదం తొక్కుతున్నారు. కేసీఆర్ తో పాటు కేటీఆర్, కవిత, హరీశ్ రావులపై బండి సంజయ్ సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక, ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు బీజేపీ మార్క్ రాజకీయం చేస్తున్నారు బండి సంజయ్. దుబ్బాక్ బైపోల్, ఆ తర్వాత బల్దియా ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన ఫలితాలు రాబట్టడంతో బీజేపీ నేతలు మంచి ఊపుమీదున్నారు. టీఆర్ఎస్, కేసీఆర్ లపై విమర్శలు గుప్పిస్తున్న బండి సంజయ్, బీజేపీ నేతలపై టీఆర్ఎస్ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే జగిత్యాలలో పర్యటించిన బండి సంజయ్ ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. జగిత్యాలలో బండి సంజయ్‌ పర్యటన నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రావాల్సిన రూ.1024 కోట్ల నిధులను వెంటనే విడుల చేయాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి నిధులు తేవాలని డిమాండ్ చేశారు. పంచాయతీలకు రావాల్సిన రూ.1,024 కోట్లను విడుదల చేయించాలని డిమాండ్ చేస్తూ వారు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో, జగిత్యాల, థరూర్ బ్రిడ్జిపై గందరగోళం నెలకొంది. జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని సర్పంచ్‌లతో పాటు టీఆర్ఎస్‌ నేతల ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. బండి సంజయ్ ను అడ్డుకోవడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నూతన వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు జగిత్యాలలో నిర్వహించిన కిసాన్ సమ్మేళన్ లో పాల్గొనేందుకు బండి సంజయ్ వెళ్లిన సందర్భంగా ఈ గొడవ జరిగింది.