Begin typing your search above and press return to search.

బాస్ బర్త్ డే వేళ.. గులాబీ నేతల ఖర్చు ఒక రేంజ్ లో ఉందట

By:  Tupaki Desk   |   18 Feb 2022 7:31 AM GMT
బాస్ బర్త్ డే వేళ.. గులాబీ నేతల ఖర్చు ఒక రేంజ్ లో ఉందట
X
అంచనాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా సాగాయి. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. కార్పొరేటర్లు.. ఇలా వారు వీరు అన్న తేడా లేకుండా గులాబీ దళం తమ ఇంట్లో పుట్టినరోజు వేడుక జరుగుతున్నంతగా ప్రాధాన్యతను ఇచ్చారు. ఎవరికి వారు.. మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో వినూత్న కార్యక్రమాల్ని నిర్వహించారు.

మంత్రి గంగుల ప్రభాకర్ యాభై అడుగుల కేసీఆర్ భారీ కటౌట్ ను ఏర్పాటు చేస్తే.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.. శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఇక.. రక్తదానాలు.. సర్వమత సమ్మేళనాలు సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.

ఎవరికి తోచింది వారు చేశారు. పుట్టినరోజు వేడుకలు ముగిసిన తర్వాత.. ఖర్చు లెక్కల మీద ఆసక్తికరంగా మారాయి.

అధినేత పుట్టిన రోజును పురస్కరించుకొని.. కీలక నేతలకు ఒక్కో కార్యక్రమాన్ని ముందస్తుగా అప్పజెప్పటం.. మంత్రులకు అవసరమైన దిశానిర్దేశంతో పాటు.. ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెట్టి మరీ పని చేయించినట్లుగా చెబుతున్నారు.

మీడియా సంస్థకు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున ప్రకటనలు ఇవ్వటం తెలిసిందే. ఇందుకు కొందరు నేతల్ని ఎంపిక చేసి మరీ.. ఖర్చు భరించాల్సిందిగా స్పష్టం చేశారు. అధినాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాల్ని తూచా తప్పకుండా పాటించిన గులాబీ నేతలకు.. ఖర్చు తడిసిమోపెడు అయ్యిందని చెబుతున్నారు.

తక్కువలో తక్కువ ఒక్కో మంత్రికి రూ.25 లక్షల వరకు ఖర్చు అయితే.. ఎమ్మెల్యేకు రూ.10 లక్షలకు పైనే అయినట్లు చెబుతున్నారు. కొందరు తమ వ్యక్తిగత ఇష్టంతో రూ.కోటి వరకు ఖర్చు పెట్టినోళ్లు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ పుట్టినరోజు ఏమో కానీ.. గులాబీ నేతల చేతి చమురు మాత్రం భారీగానే వదిలిందన్న మాట వినిపిస్తోంది.