Begin typing your search above and press return to search.

కేటీఆర్ కెప్టెన్‌గా ఆప‌రేష‌న్ ఎంఐఎం

By:  Tupaki Desk   |   15 Dec 2015 6:00 PM GMT
కేటీఆర్ కెప్టెన్‌గా ఆప‌రేష‌న్ ఎంఐఎం
X
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని పాత‌బ‌స్తీలో ద‌శాబ్దాలుగా తిరుగులేని ఆధిప‌త్యం చెలాయిస్తున్న ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ రంగం సిద్ధం చేస్తోంది. ఎట్టి ప‌రిస్థితుల్లోను గ్రేట‌ర్ పీఠం ద‌క్కించుకునేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్న టీఆర్ఎస్ గ‌త కొద్ది రోజులుగా పాత‌బ‌స్తీపై ప్ర‌త్యేక దృష్టి సారించింది. కొద్ది రోజుల్లో గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో టీఆర్ఎస్ న‌గ‌రంలో చాప‌కింద నీరులా ప్ర‌చారం ప్రారంభించింది. ఎట్టి ప‌రిస్థితుల్లోను ఇత‌ర పార్టీల‌తో పొత్తు లేకుండానే మ్యాజిక్ ఫిగ‌ర్ 76 స్థానాలు ద‌క్కించుకోవాల‌నుకుంటున్న టీఆర్ఎస్ అందుకు త‌గ్గ‌ట్టుగానే స‌న్నాహాలు ప్రారంభించింది.

గ్రేట‌ర్‌లో ఉన్న 150 డివిజ‌న్ల‌లో పాత‌బ‌స్తీలోని 50 డివిజ‌న్ల వ‌ర‌కు మ‌జ్లీస్‌దే ఆధిప‌త్యం. ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ మ‌జ్లీస్‌ను కాద‌ని ఏ పార్టీ కూడా విజ‌యం సాధించ‌ద‌లేదు. వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి స్ర్టాంగ్ సీఎంగా ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌న మ‌జ్లిస్‌తో లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నార‌న్న వ్యాఖ్య‌లు వ‌చ్చాయి. చివ‌రిసారి కూడా కాంగ్రెస్ ఎంఐఎంతో గ్రేట‌ర్ పీఠాన్ని పంచుకుంది. ఎంఐఎం డిమాండ్ల‌కు త‌లొగ్గ‌డం కంటే ఆ పార్టీతో నేరుగా ఢీకొట్ట‌డ‌మే మంచిద‌న్న భావ‌న‌లో టీఆర్ఎస్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ ఆప‌రేష‌న్ ఎంఐఎంకు ప్లాన్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల త‌ర‌చూ పాత‌బ‌స్తీలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న అక్క‌డ ప్ర‌జ‌ల‌కు పలు వ‌రాలు ప్ర‌క‌టిస్తూ టీఆర్ఎస్ వైపున‌కు తిప్పేందుకు కృషి చేస్తున్నారు.

ఈ రోజు కేటీఆర్ ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హోం శాఖా మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి, మంత్రులు మ‌హేంద‌ర్‌రెడ్డి, ప‌ద్మారావుతో క‌లిసి బండ్లగూడలో ఆర్టీఏ ఆఫీసు ప్రారంభించారు. అనంతరం ఆయ‌న‌ మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ ప్ర‌భుత్వం రోల్ మోడ‌ల్ పాల‌న కొన‌సాగిస్తోంద‌న్నారు. క‌రెంటు క‌ష్టాలు లేకుండా చేసేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నార‌ని చెప్పన కేటీఆర్ పేదల దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోకుండా 400 మందికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లను కట్టించామన్నారు. అంతే కాకుండా భవిష్యత్‌లో ఇంకో 10 వేల ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామన్నారు. మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మైనార్టీ పేద యువతుల పెళ్లి కోసం 51 వేలు ప్రభుత్వం ఇస్తోందన్నారు. కేటీఆర్ ప్ర‌సంగాల‌కు మైనార్టీల నుంచి కూడా మంచి స్పంద‌న వ‌స్తోందన్న వ్యాఖ్య‌లు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేటీఆర్ దూకుడు చూస్తుంటే పాత‌బ‌స్తీతో ఎంఐఎంకు టీఆర్ఎస్ గ‌ట్టి పోటీ ఇవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.