మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ ఎస్ పోటీ..కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

Tue Sep 17 2019 21:49:36 GMT+0530 (IST)

trs candidates to contest in maharashtra elections

తెలంగాణ రాష్ట్ర సమితి ( టీఆర్ ఎస్ ) మొదటి సారి మరో రాష్ట్రంలోని ఎన్నికల్లో పోటీపడనుంది. ప్రత్యేక తెలంగాణ నినాదంతో 2001లో ఆవిర్భవించిన ఈ పార్టీ తెలంగాణ కోసం 15 ఏళ్ల పాటు కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పోరాటాలు చేసి మరీ ప్రత్యేక తెలంగాణ సాధించుకుంది. ఇక తెలంగాణ ఏర్పడిన వెంటనే జరిగిన తొలి ఎన్నికల్లో 2014లో గెలిచిన టీఆర్ఎస్ 2018లో జరిగిన ఎన్నికల్లోనూ వరుసగా రెండోసారి విజయం సాధించి మరోసారి అధికారంలోకి వచ్చింది.ఇక డిసెంబర్ ఎన్నికల తర్వాత టీఆర్ ఎస్ ఏపీలోనూ పోటీ చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. రెండోసారి పార్టీ ఘనవిజయం సాధించాక ఆంధ్రాలో పోటీ చేస్తే తాము కొన్ని సీట్లలో గెలుస్తామని... కోడిపందాలకు అనుమతులు ఇస్తే పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతంతో పాటు... తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాలు అయిన నందిగామ - జగ్గయ్యపేటలో తాము అభ్యర్థులను నిలబెడతామని సీరియస్‌గానే చెప్పారు. ఆ తర్వాత ఏప్రిల్ లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు కూడా ఒకేసారి రావడంతో ఈ విషయం అందరూ మర్చిపోయారు.

మహారాష్ట్రలో పోటీ...

ఇక ఇప్పుడు ఉత్తర తెలంగాణకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగాలని గులాబీ బాస్ కేసీఆర్ ఆ పార్టీ నాయకులకు సూచించారు. గతంలో నాందేడ్ జిల్లాలోని 6 నియోజకవర్గాలను తెలంగాణలో కలపాలని ఆ ప్రాంత నేతలు ఉద్యమించిన సంగతి తెలిసిందే.. అయితే ఈ మేరకు టీఆర్ ఎస్ పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారు. నాందేడ్ - గడ్చిరోలి జిల్లాల్లోని తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు చెందిన ప్రజలకు తెలంగాణకు ఎంతో అనుబంధం ఉంది.

ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రజలు భూములు అటు - ఇటు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం నిజాం సంస్థానంలోనే ఉండేది. ఇక తెలంగాణలో హైదరాబాద్ కింగ్ మేకర్ అయిన ఎంఐఎం మహారాష్ట్రలో పోటీ చేసి రెండు అసెంబ్లీ స్థానాలతో పాటు ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఔరంగాబాద్ ఎంపీ సీటు సైతం గెలుచుకుంది. మరి ఇప్పుడు టీఆర్ ఎస్ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసి.. ఆ అసెంబ్లీలో పోటీ చేస్తుందేమో ?  చూడాలి.