Begin typing your search above and press return to search.

ఉన్నవే రెండు... ఒకటి కేకేకు, రెండోది కేఆర్ కు

By:  Tupaki Desk   |   12 March 2020 2:19 PM GMT
ఉన్నవే రెండు... ఒకటి కేకేకు, రెండోది కేఆర్ కు
X
తెలంగాణలో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో ఇప్పుడు ఓ వింత పరిస్థితి కనిపిస్తోందనే చెప్పాలి. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టిన కేసీఆర్... సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం మిశ్రమ ఫలితాలను చవిచూశారు. ఈ ఫలితాల్లో పార్టీతో పాటు తన సొంత కూతురు కవితకు చుక్కలు చూపిన నిజామాబాద్ జిల్లా ఇప్పటికీ కేసీఆర్ కు కొరుకుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఇందూరును తన కంచుకోటగా మలచుకునేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే పార్టీకి దఖలు పడనున్న రెండు రాజ్యసభ స్థానాలను కేటాయిస్తూ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ కు ఇప్పుడు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లకు పార్టీ సీనియర్ నేత కే. కేశవరావు, ఇటీవలే పార్టీలో చేరిన కాంగ్రెస్ మాజీ నేత, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డిలను ఎంపిక చేస్తూ కేసీఆర్ అందరికీ షాకిచ్చారనే చెప్పాలి.

కేశవరావు విషయానికి వస్తే.. ఇప్పటికే ఓ దఫా టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అయితే పార్టీ ఎంపీలకు పార్లమెంటులో దిశానిర్దేశం చేయాల్సిన గురుతర బాధ్యత ఉన్న నేపథ్యంలో రెండో టెర్మ్ కూడా కేశవరావును రాజ్యసభకు పంపేందుకే కేసీఆర్ నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా... కేకే సొంత జిల్లా అయిన నిజామాబాద్ కే చెందిన కేఆర్ సురేశ్ రెడ్డికి రెండో సీటు ఇవ్వడంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. మొన్నటి ఎన్నికలకు కాస్తంత ముందుగా సురేశ్ రెడ్డి కాంగ్రెస్ ను వదిలి టీఆర్ఎస్ లోకి చేరిపోయారు. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో కొనసాగుతున్న సురేశ్ రెడ్డి... దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం లో అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. అయితే వైఎస్ అకాల మరణంతో సురేశ్ రెడ్డి కూడా దాదాపుగా ఫేడ్ అవుట్ అయిపోయారు.

అయితే నిజామాబాద్ జిల్లాలో వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బల నేపథ్యంలో కాస్తంత క్లీన్ చిట్ కలిగిన నేతలైతే బాగుంటుందన్న వాదన చాలా కాలం నుంచి టీఆర్ఎస్ లో వినిపిస్తోంది. వివాదరహిత నేతలను ముందు పెట్టి... నిజామాబాద్ లో క్రమంగా బలపడుతున్న బీజేపీకి అడ్డుకట్ట వేయాలన్నది కేసీఆర్ అభిమతంగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఏ ఒక్క వివాదం లేని సురేశ్ రెడ్డికి మంచి ప్రాధాన్యం కల్పించడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలన్న భావనకు కేసీఆర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో త్వరలో జరగనున్న నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురేశ్ రెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలపాలని కేసీఆర్ భావించినట్లుగా సమాచారం. అయితే ఎందుకో తెలియదు గానీ... కాస్తంత గట్టి పోటీ ఉండే ఎమ్మెల్సీ ఎన్నికల కంటే సులభంగా ముగిసే రాజ్యసభ ఎన్నికల ద్వారానే సురేశ్ రెడ్డిని రాజ్యసభకు పంపాలని కేసీఆర్ భావించారట.

సురేశ్ రెడ్డికి సీటివ్వడం ద్వారా ఆయన సామాజిక వర్గం రెడ్లు కూడా తమ పార్టీ పట్ల సానుకూలంగా మారే అవకాశాలున్నాయన్న కోణంలోనూ ఆలోచించిన కేసీఆర్... సురేశ్ రెడ్డికి సీటిచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఈ రెండు సీట్లలో ఒకటి వేరే వారికి ఇచ్చినా... తన కూతురు కవితకు మరో సీటిచ్చి రాజ్యసభకు పంపాలని, అయితేగియితే కేంద్ర మంత్రివర్గంలో చేరాల్సి వస్తే... కవితకు ఛాన్సివ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా విశ్లేషణలు వినిపించాయి. అయితే ఉన్నవే రెండు సీట్లు అయితే... ఒకటి తన కూతురుకు ఇచ్చుకోవడం ద్వారా తనకు ఒనగూరే చాలా ప్రయోజనాలను వదులుకునేందుకు కేసీఆర్ వెనుకంజ వేసినట్లుగానూ తెలుస్తోంది. అంతగా కవితకు పదవే కావాల్సి వస్తే... చాలా అవకాశాలే ఉన్నాయి కదా... తమను అంతో ఇంతో ఢీకొట్టేందుకు యత్నిస్తున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు రెండు సీట్లను ఇందూరుకు కేటాయించేసి.. మరోవైపు తమతో ఢీ అంటే ఢీ అంటున్న కాంగ్రెస్ లోని రెడ్డి సామాజికవర్గాన్ని దెబ్బ కొట్టేందుకు సురేశ్ రెడ్డిని కేసీఆర్ ఎంపిక చేసినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.