Begin typing your search above and press return to search.

ప్రవీణ్ పై డైరెక్ట్ అటాక్ చేస్తున్న టీఆర్ఎస్

By:  Tupaki Desk   |   10 Aug 2021 11:30 PM GMT
ప్రవీణ్ పై డైరెక్ట్ అటాక్ చేస్తున్న టీఆర్ఎస్
X
బహజన సమాజ్ పార్టీలో చేరిన గురుకుల మాజీ కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల బాణాలను సంధిస్తున్నారు. ఐపీఎస్ అధికారిగా ఉన్న ప్రవీణ్ తాను కోరుకొని గురుకులాల కార్యదర్శిగా పోస్టింగ్ వేయించుకున్నారు. అనుకున్నట్లుగా గురుకులాలను సక్సెస్ చేయగలిగారు. అయితే అంతటి విజయవంతానికి ప్రభుత్వమే కారణమని చెప్పుుకొచ్చారు. కానీ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రవీణ్ ఒక్కసారిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ప్రవీణ్ కుమార్ విమర్శలపై టీఆర్ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కౌంటర్ ఇస్తున్నారు.

ఐపీఎస్ అధికారిగా విజయవంతంగా విధులు నిర్వహించిన ప్రవీణ్ కుమార్ ఆ తరువాత గురుకుల కార్యదర్శిగా చేరారు. ఎస్సీ, ఎస్టీల పిల్లలకు సేవ చేద్దామనే ఈ పోస్టింగ్లో జాయిన్ అయ్యానని ప్రవీణ్ చాలాసార్లు మీడియా ద్వారా వెల్లడించారు. అయితే రాష్ట్రంలో అప్పటి వరకు గురుకులాలు ఒకలెక్క.. ప్రవీణ్ వచ్చాక మరో లెక్క.. అన్నట్లుగా విద్యాసంస్థలు మారిపోయాయి. కొన్ని గురుకుల పాఠశాలల్లో సీట్లు కూడా దొరకని పరిస్థితి నెలకొందంటే అందుకు ప్రవీణ్ కుమారే కారణమని చెబుతారు. దీంతో చాలా మంది గురుకులాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ కు సపోర్టు చేశారు. ప్రవీణ్ కుమార్ గొప్పతనాన్ని ఆయన ప్రయోజనం పొందిన విద్యార్థులు చెప్పడంపై ప్రభుత్వం కూడా హర్షం వ్యక్తం చేసింది.

అయితే ఇంతటి సక్సెస్ వెనుక ప్రభుత్వ సహకారాలున్నాయని ప్రవీణ్ చాలా సార్లు చెప్పారు. అలాగే తనకు అనుకున్న చోటే పోస్టింగ్ ఇవ్వడం వల్ల దళిత పిల్లలకు న్యాయయం చేయగలిగానని అన్నారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ కూడా ప్రవీణ్ చేతలకు అడ్డు చెప్పేవారు కారని కొందరు అంటారు. ప్రవీణ్ కుమార్ కూడా కేసీఆర్ పై చాలా సార్లుపొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఒక్కసారిగా ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శి పోస్టుకు రాజీనామా చేసిన తరువాత సీన్ మారిపోయింది. ముందుగా ఆయన ఏ పార్టీలో చేరనని చెప్పి.. ఆ తరువాత బీఎస్పీలో చేరిపోయారు. అయితే దళితుల అభివృద్ధికి బీఎస్పీ సపోర్టు కావాలని ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలో చెప్పారు. అయితే కొందరు సొంత పార్టీ పెట్టుకోవచ్చు గదా అని సూచించారు. కానీ అలాంటి చాన్స్ లేదని ప్రవీణ్ చెప్పారు. కాన్సీరాం బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని అందుకు బీఎస్పీలో చేరానని చెప్పారు.

ఇక మొదట్లో తాను దళితుల సేవ చేసేందుకు రాజీనామా చేశానని, ప్రభుత్వంపై, కేసీఆర్ పై తనకు కోపం లేదని చెప్పాడు. అయితే ఆ తరువాత దళిత బంధు పథకంను వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఇక మొన్న బీఎస్పీలో చేరిన తరువాత ఏకంగా ప్రతిపక్ష పార్టీ రేంజ్లో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బీఎస్పీలోని ఏ నాయకుడు ఇంతలా ప్రభుత్వంపై విరుచుకుపడలేదు. కానీ ప్రభుత్వ అధికారికగా కొనసాగిన ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్ పై విమర్శల బాణాలు సంధించడంపై చర్చనీయాంశంగా మారింది.

అయితే టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు గ్యాదిరి కిషోర్, సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, భాస్కర్ రావు లు ప్రవీణ్ కుమార్ అప్పట్లో సీఎం కేసీఆర్ ను పొగొడిన క్లిప్పింగులు, పేపర్ కటింగ్లు బయటపెడుతున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ మెప్పు పొందిన ప్రవీణ్ కుమార్ ఇలా ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం తగదన్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై మద్దతుగా మాట్లాడిన ప్రవీణ్, ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత విమర్శలు చేయడంపై ఎమ్మెల్యేలు ఎండగడుతున్నారు. అయితే ఇన్నాళ్లు ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన బీఎస్పీలోకి చేరగానే ఇలా మాట్లాడడంపై వారు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.