Begin typing your search above and press return to search.

తెలంగాణకు మరో మణిహారం

By:  Tupaki Desk   |   26 Jun 2021 8:00 AM IST
తెలంగాణకు మరో మణిహారం
X
తెలంగాణకు మరో పెద్ద పెట్టుబడి వస్తోంది. ఊహించని విధంగా అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు రాగా.. తాజాగా మరో సంస్థ భారీ పెట్టుబడితో ముందుకొచ్చింది. 2020 అక్టోబర్‌లో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ (ఇవి అండ్ ఇఎస్) విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది, ఇది కాలుష్యాన్ని కూడా తగ్గించడానికి దోహదపడేలా తీర్చిదిద్దారు.

ఈ విధానం సత్ఫలితాలను ఇచ్చింది. అమెరికన్ ఎలక్ట్రిక్ వెహికల్ మరియు క్లీన్ ఎనర్జీ కంపెనీ టెస్లాకు ప్రత్యర్థి అయిన ట్రిటాన్ తెలంగాణలో పెట్టుబడికి ముందుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది. ట్రిటాన్ రూ. 21,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ కంపెనీ పెట్టుబడి ద్వారా తెలంగాణలో 24,000 ఉద్యోగాలు, స్థానిక యువతకు పరోక్ష ఉపాధి లభిస్తుంది.

''సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని నిమ్జ్ వద్ద అల్ట్రా మోడరన్ ఇ.వి. తయారీ విభాగాన్ని స్థాపించడానికి అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ ట్రిటాన్ ఇ.వి 21000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించడం ఆనందంగా ఉందని'' మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో తెలిపారు. ఈ రోజు తెలంగాణ ట్రిటాన్ ఇ.వి & ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈ పెట్టుబడితో సుమారు 25 వేల మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది అని ట్రిటాన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత కేటీఆర్ ట్వీట్ చేశారు.

సెరి ట్రక్కులు, సెడాన్లు, లగ్జరీ ఎస్‌యూవీలు, రిక్షాలు సహా మొదటి ఐదేళ్లలో ట్రిటాన్ 50,000 వాహనాలను ఉత్పత్తి చేస్తుందని ఐటీ మంత్రి తెలిపారు. ట్రిటాన్ ఉత్పత్తులను తయారు చేస్తే హైదరాబాద్ రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాలను చూడగలిగే మొదటి రాష్ట్రం తెలంగాణ కావచ్చు.

ఈవీ-ఈఎస్ పాలసీతోపాటు తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 4 బిలియన్ డాలర్ల పెట్టుబడి - 1.2 లక్షల ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకుంది.