Begin typing your search above and press return to search.

ఎట‌కారంగా మారిన బీజేపీ సీఎం మాట‌లు

By:  Tupaki Desk   |   18 April 2018 6:07 AM GMT
ఎట‌కారంగా మారిన బీజేపీ సీఎం మాట‌లు
X
కొన్ని మాట‌లు అతికిన‌ట్లుగా ఉండ‌వు. గ‌తం గురించి గొప్ప‌లు చెప్పుకోవ‌టం బాగానే ఉంటుంది కానీ అది శ్రుతిమించిన‌ట్లుగా ఉండ‌కూడ‌ద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. తాజాగా అలాంటి ప‌నే చేసి అంద‌రి నోట్లో నానుతున్నారు బీజేపీ ముఖ్య‌మంత్రి ఒక‌రు. ఈ మ‌ధ్య‌నే త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ విప్లవ్‌ కుమార్‌ దేవ్ మాట‌లు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి.

ఆగ‌ర్త‌లాలోని ఒక కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆయ‌న‌.. మ‌హాభార‌త కాలంలోనే ఇంట‌ర్నెట్‌.. శాటిలైట్ వ్య‌వ‌స్థ భార‌త్‌కు అందుబాటులో ఉండేద‌న్న మాట‌ల్ని చెప్పుకొచ్చారు. దీనికి పురాణ గ్రంధమైన మ‌హాభార‌తాన్ని కోట్ చేయ‌టం గ‌మ‌నార్హం. మ‌హాభార‌త సంగ్రామంలో ఎప్ప‌టిక‌ప్పుడు ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని సంజ‌య ద్రుత‌రాష్ట్రుడికి తెలియ‌జేశాడ‌ని.. అది ఇంట‌ర్నెట్ వ‌ల్లే సాధ్య‌మైంద‌న్నాడు. ఈ టెక్నాల‌జీ అప్ప‌ట్లోనే ఉంద‌ని మ‌న‌కు తెలీద‌న్నాడు. ఇంట‌ర్నెట్‌ ను ప్రాశ్చాత్య దేశాలు క‌నుగున్నాయ‌ని అంద‌రూ భావిస్తార‌ని.. కానీ ల‌క్ష‌ల ఏళ్ల క్రిత‌మే భార‌త్ ఇంట‌ర్నెట్ ను వినియోగించింద‌ని తెలుసుకోవాల‌న్నారు.

సాంకేతిక‌త‌కు భార‌త్ పుట్టినిల్లు అని.. అలాంటి దేశంలో తాను పుట్టినందుకు గ‌ర్వంగా ఉంద‌న్న సీఎం.. ఇంట‌ర్నెట్ నుంచి అద్భుత సాంకేతిక‌త‌ను దేశ ప్ర‌జ‌లంద‌రికి ప్ర‌ధాని మోడీ అందుబాటులోకి తెస్తున్నార్నారు. బీజేపీ సీఎం మాట‌ల‌పై ఆన్ లైన్లో జోకుల మీద జోకులు పేలుతున్నాయి. బీజేపీలో ఉంటూ కెరీర్ ను డెవ‌ల‌ప్ చేసుకోవాలంటే ఇలాంటి స్టుపిడ్ కామెంట్స్ చేయాల్సిందేనా? అని ఒక‌రు ప్ర‌శ్నిస్తే.. మ‌రికొంద‌రు కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. విప్ల‌వ్ చెప్పిన మాట‌లే నిజ‌మైతే.. ప‌ద్మ‌వ్యూహంలోకి వెళ్లిన అభిమ‌న్యుడు ఎలా వెన‌క్కు రావాలో క్వొరా (ఏ ప్ర‌శ్న‌కైనా స‌మాధానం చెబుతుంద‌ని చెప్పే సైట్‌) లో ఎందుకు అడ‌గ‌లేదు? అని ప్ర‌శ్నించారు. పేరులో విప్ల‌వ్ ఉన్నా.. మాట‌ల్లో మాత్రం అందుకు భిన్న‌మైన జోకులు రావ‌టం ఎందుకో అతికిన‌ట్లుగా అనిపించ‌ట్లేదు క‌దా?