Begin typing your search above and press return to search.

తలాక్ చెప్పి నిర్బ‌య కేసులో చిక్కుకున్నాడుగా!

By:  Tupaki Desk   |   30 Aug 2017 4:57 AM GMT
తలాక్ చెప్పి నిర్బ‌య కేసులో చిక్కుకున్నాడుగా!
X
ఏ దేశం ఆ దేశ పార్ల‌మెంటు చేసే చ‌ట్టాల వ‌ల్ల‌ - న్యాయ‌స్థానాలు ఇచ్చే తీర్పు వ‌ల్ల గొప్ప‌ది అవ‌దు. ఆ దేశంలో ప్ర‌జ‌లు ఆ చ‌ట్టాలు - తీర్పులు పాటించడం వ‌ల్లే దేశానికి గొప్ప‌త‌నం వస్తుంది అనే మాటలు వినే ఉంటాం! నిజ‌మే.. సుప్రీంకోర్టు ఎన్ని తీర్పులిచ్చినా.. వాటిని పాటించాల్సిన బాధ్య‌త పౌరుల‌దే! ముస్లిం మ‌హిళ‌ల హ‌క్కుల‌ను ర‌క్షించేలా సుప్రీం.. త‌లాక్ ను ర‌ద్దు చేస్తూ సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన‌ప్పుడు దేశ‌మంతా హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ఈ తీర్పుపై ముస్లిం మ‌హిళ‌లు సంబ‌ర‌ప‌డిపోయారు. కానీ వాటిని బేఖాత‌రు చేస్తూ త‌లాక్ చెప్పి.. క‌ట్టుకున్న భార్య‌ను వ‌దిలేశాడో వ్య‌క్తి! ఇప్పుడు అత‌డిపై దేశంలో తొలిసారిగా నిర్బ‌య కేసు న‌మోదు అయ్యింది. అంతేగాక అత‌డు హైదరాబాదీ కావ‌డం గ‌మ‌నార్హం!

త‌లాక్‌ ముస్లిం మహిళల స్వేచ్ఛను హరించే ఉదంతమ‌ని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అత్యున్న‌త న్యాయ‌స్థానం స్పష్టం చేసిన విష‌యం తెలిసిందే! ముస్లిం మహిళలకు ప్రాణ సంకటంగా పరిణమించిన తలాక్ సంస్కృతిపై సుప్రీం తీర్పు నెగిటివ్ గా రావడంతో దేశంలోని ముస్లిం మహిళలను సమర్ధించే ప్రతి ఒక్కరూ సంబరాల్లో మునిగిపోయారు. ఇది జ‌రిగి కొద్ది రోజులైనా గ‌డ‌వ‌క‌ముందే ఈ తీర్పును ఉల్లంఘించాడు ఒక హైద‌రాబాదీ. మ‌గ పిల్లాడు అనుకుంటే ఆడ‌పిల్ల పుట్టింద‌ని త‌లాక్ చెప్పి.. భార్య‌ను వదిలేశాడు.

మగ పిల్లాడి కోసం నగరంలోని ఛార్మినార్ లో బాబా వద్ద వైద్యం చేయించుకోవాల‌ని త‌న‌ భర్త హుస్సేన్‌ ఒత్తిడి తీసుకురావడంతో ఆ మ‌హిళ అత‌డి వ‌ద్ద‌కు వెళ్లింది. ఆ బాబా ఆమె ప‌ట్ల‌ అసభ్యకరంగా ప్రవర్తించడంతో మళ్లీ ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్ల‌లేదు. ఆమెకు ఇటీవ‌ల‌ ఆడపిల్ల పుట్టింది. దీంతో హుస్సేన్ ఆమెకు తలాక్ చెప్పాడు. దీంతో తన భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ మ‌హిళ‌ భర్త - అత్త - మామ సహా ఎనిమిది మందిపై చార్మినార్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో నకిలీ బాబా సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ మ‌హిళ భ‌ర్త హుస్సేన్‌ ప్రస్తుతం అబుదాబీ లో ఉన్నాడు. అతనిని అరెస్టు చేసేందుకు లుకౌట్‌ నోటీసులు పంపారు. నిర్భ‌య చ‌ట్టం కింద అత‌డిపై కేసు న‌మోదు చేశారు. త‌లాక్‌ పై సుప్రీం తీర్పును ఉల్లంఘించడంతో న‌మోదైన తొలి నిర్భ‌య కేసుగా ఈ కేసు రికార్డుల‌కెక్క‌నుంది.