Begin typing your search above and press return to search.

పరామర్శకు వెళ్లిన మహిళా నేతల జాకెట్లు పట్టుకొని లాగేసి..లాఠీలతో కొట్టారట!

By:  Tupaki Desk   |   3 Oct 2020 12:15 PM IST
పరామర్శకు వెళ్లిన మహిళా నేతల జాకెట్లు పట్టుకొని లాగేసి..లాఠీలతో కొట్టారట!
X
యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ కు బ్యాడ్ టైం నడుస్తోందా? ఏం జరిగినా సరే.. అధికారంలో ఉన్న తాము అనుకుంటే.. విషయం ఏదీ బయటకు రాకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన హాథ్రస్ బాలిక గ్యాంగ్ రేప్ ఉందతం వేళ యోగి సర్కారు వ్యవహరిస్తున్న తీరును అందరూ తప్పు పడుతున్నారు. తప్పుల మీద తప్పులు చేస్తున్న పోలీసుల తీరుతో యోగి సర్కారు మాత్రమే కాదు బీజేపీ ఇమేజ్ దారుణంగా దెబ్బ తినే పరిస్థితి నెలకొంది.

హాథ్రస్ బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న నేతల్ని.. మహిళల్ని అడ్డుకుంటున్న పోలీసులు వారి పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. తృణమూల్‌ మహిళా ప్రతినిధి బృందానికీ ఎదురైన అనుభవం వారెప్పటికి మర్చిపోలేరేమో? ఆ మాటకు వస్తే.. ఈ పరిణామం యోగి సర్కారుకు పెద్ద మచ్చగా మిగిలిపోవటమే కాదు.. మరెప్పటికి తుడిచి వేయలేని రీతిలో ఉంటుందని చెబుతున్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వీలుగా.. కోవిడ్ నిబంధనల్ని తూచా తప్పకుండా తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రతినిధి బృందం విడివిడిగా ఊళ్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. వీరికి ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు డెరెక్ ఒబ్రెయిన్ నేతృత్వం వహించారు.ఆ పార్టీ మహిళా ఎంపీ ప్రతిమా మండల్.. ఇతర మహిళల్ని గ్రామంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. డెరెక్ ఒబ్రెయిన్ ను బలవంతంగా పోలీసులు లాగి కిందకు పడేస్తే.. మహిళా నేతలపై పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతల్ని వెనుకా ముందు చూడకుండా.. వారి జాకెట్లు పట్టుకొని పక్కకు లాగేస్తూ పోలీసులు వ్యవహరించిన తీరును పలువురు తప్పు పడుతున్నారు. మీడియాను ఊళ్లోకి అనుమతించకుండా.. బయటే నిలిపేశారు. పరామర్శకు వస్తున్న రాజకీయ నేతల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకంగా ఉంది. తృణమూల్‌ నేతలకు ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు మరో వివాదంగా మారింది. మహిళా నేతల్ని వారి జాకెట్లు పట్టుకొని పక్కకు గుంజేయటం.. ఈ సందర్భంగా లాఠీలతో వారిని కొట్టిన తీరు యోగి సర్కారు ఇమేజ్ ను డ్యామేజ్ చేయటమే కాదు.. మాయని మచ్చగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.

గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల ముందు మహిళా నేతల్ని నిలిపివేసిన పోలీసుల తీరుతో.. వారు రెండు చేతులు జోడించి.. తాము విడివిడిగా వెళ్లి.. బాధిత కుటుంబాన్ని పరామర్శించి వస్తామని చెప్పారు. అయినప్పటికీ వారిని అనుమతించేందుకు పోలీసులు ససేమిరా అన్నారు. ఈ సందర్భంగా తృణమూల్‌ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ బైఠాయించటమే కాదు.. మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు. బాధితురాలి తండ్రిని పోలీసులు తీవ్రంగా కొట్టారని.. దీంతో అతను తరచూ స్పృహ తప్పుతోందని ఆరోపించారు. దీంతో యోగి సర్కారు మరింత ఆత్మరక్షణలో పడింది. ఇంతకూ మీడియాను కానీ.. పరామర్శకు వచ్చే వారిని కానీ యోగి సర్కారు ఎందుకు అనుమతించట్లేదన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లభించని పరిస్థితి.