Begin typing your search above and press return to search.

ఆ 2 దేశాల పాస్ పోర్టులు ఉంటే ఏకంగా 192 దేశాలకు వెళ్లొచ్చు

By:  Tupaki Desk   |   25 Oct 2021 4:25 AM GMT
ఆ 2 దేశాల పాస్ పోర్టులు ఉంటే ఏకంగా 192 దేశాలకు వెళ్లొచ్చు
X
ప్రపంచంలో అత్యంత పవర్ ఫుల్ పాస్ పోర్టు ఏది? ఏ దేశపు పాస్ పోర్టు ఉంటే.. వీసా అవసరం లేకుండా అత్యధిక దేశాలకు వెళ్లొచ్చు? అన్న ప్రశ్నకు తాజాగా విడుదలైన ‘హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్’ వివరాల్ని వెల్లడించింది. తాజా రిపోర్టు ప్రకారం ప్రపంచ దేశాల్లో పవర్ ఫుల్ దేశాల పాస్ పోర్టుల విషయానికి వస్తే.. జపాన్.. సింగపూర్ లు మొదటిస్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్ పోర్టులు ఉంటే.. ఏకంగా 192 దేశాలకు ఎలాంటి ముందస్తు వీసా లేకుండా విమానం ఎక్కేయొచ్చు. ఎంచక్కా సదరు దేశానికి వెళ్లి.. అప్పటికప్పుడు వీసా ఇచ్చేసే పరిస్థితి.

ఒక పాస్ పోర్టుతో ఎన్ని దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు? అన్న అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆయా దేశాల పాస్ పోర్టులకు ర్యాంకులు నిర్ణయించారు. ప్రయాణాలకు అత్యంత స్నేహపూరితంగా ఉండేలా పాస్ పోర్టులు ఇచ్చే దేశాల్ని ఈ సూచీల్లో పేర్కొంటారు. గడిచిన రెండేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా ఆంక్షలు విధిస్తూ.. ఇప్పుడిప్పుడే వాటిని ఎత్తేస్తున్న వేళ ఈ ర్యాంకులను ప్రకటించారు.

జపాన్.. సింగపూర్ దేశాల పాస్ పోర్టులు ఉంటే 192 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అందుకే జాబితాలో టాప్ లో నిలిచారు. తర్వాతి స్థానంలో దక్షిణ కొరియా.. జర్మనీలు నిలిచాయి. మరి.. మన దేశం సంగతేంటి? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం చూస్తే.. ఈ సూచీలో మనం 90వ స్థానంలో నిలిచారు. ఇబ్బందికరమైన విషయం ఏమంటే.. గత ఏడాది 84లో ఉన్న ర్యాంకు తాజాగా 90కు పడిపోయింది. దీంతో.. భారతీయులు కేవలం 58 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లి.. అరైవల్ వీసాను పొందే వీలుంది.

తాజా ర్యాంకుల్లో భారత్ సరసన తజికిస్థాన్.. బుర్కినా ఫోసోలు నిలిచాయి. గడిచిన మూడేళ్లుగా జపాన్ అగ్రస్థానంలో నిలిస్తే.. అఫ్గానిస్థాన్.. ఇరాక్..సిరియా.. పాక్.. యెమన్ దేశాలు జాబితాలోచివర్లో నిలిచాయి. మోడీ లాంటి పవర్ ఫుల్ నేత దేశ ప్రధానిగా ఉన్న వేళలో.. భారతీయుల ఇమేజ్ మరింత పెరిగిందన్న మాటకు భిన్నంగా.. వెనకడుగు పడటం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.