Begin typing your search above and press return to search.

ట్రంప్ చుట్టూ ఉచ్చు..కొత్త వీడియో.. ఆడియో టేపుల కలకలం

By:  Tupaki Desk   |   12 Feb 2021 3:10 PM IST
ట్రంప్ చుట్టూ ఉచ్చు..కొత్త వీడియో.. ఆడియో టేపుల కలకలం
X
అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన ట్రంప్ హయాంలో చోటు చేసుకున్న సంచలనాలకు కొదవ ఉండదు. ఆయన పదవీ కాలం ముగిసే క్రమంలో చోటు చేసుకున్న క్యాపిటల్ హిల్ భవన ఘటన షాకింగ్ గా మారింది. తన పదవీకాలంలో ట్రంప్ ఎదుర్కొన్న విమర్శలకు రెట్టింపు ఒక్క క్యాపిటల్ హిల్ ఘటన కారణమైంది. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. ఆ సందర్భంగా ట్రంప్ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టే పరిస్థితి.

కీలకమైన క్యాపిటల్ హిల్ భవనం వద్ద ట్రంప్ మద్దతుదారులు నిరసన చేపట్టటం.. అనూహ్యంగా భవనాన్ని ముట్టడించి.. హింసాత్మకంగా వ్యవహరించటం.. చివరకు భద్రతా సిబ్బంది కాల్పులు జరిపే వరకు విషయం వెళ్లటం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ట్రంప్ పై అభిశంసన తీర్మానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు డెమొక్రాట్లు. ఈ తీర్మానానికి రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నా.. ఆరుగురు సభ్యులు మాత్రమే అందుకు తమ మద్దతు ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన కొత్త వీడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. అదే విధంగా మరో ఆడియో క్లిప్ కూడా వెలుగుచూసింది. వీటిని చూసినంతనే.. ఈ వ్యవహారంలో ట్రంప్ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకునేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తం కాక మానదు.

తాజాగా అభిశంసన తీర్మానంపై సెనెట్ లో బుధవారం విచారణ మొదలైంది. ట్రంప్ నకు వ్యతిరేకంగా డెమొక్రాటిక్ నేతలు పలువురు బలమైన వాదనలు వినిపించారు. ట్రంప్ అమాయకుడు కాదని.. దేశ ప్రజల్ని.. రాజ్యాంగాన్ని.. ప్రభుత్వాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన వ్యక్తి.. తన ప్రాథమిక విధుల్ని విస్మరించటం ఏమటన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బయటకు వచ్చిన వీడియోలో.. మాజీ ఉపాధ్యక్షుడు పెన్స్.. నాన్సీ పెలోసీల కోసం ఆందోళనకారులు ఆగ్రహంగా వెతకటం కనిపించింది. ఆ రోజు కానీ.. వారు దొరికి ఉంటే కచ్ఛితంగా దారుణం జరిగి ఉండేదన్నట్లుగా వీడియో ఉంది. పెన్స్ ను ఉరి తీయడంటూ వీడియోలో ఉంది. తాజాగా వెలుగు చూసిన ఆడియో క్లిప్ లో భద్రతా సిబ్బంది హాహాకారాలు.. తమపైకి ఆందోళకారులు విసురుతున్న వస్తువుల గురించి సిబ్బంది అరవటం అందులో రికార్డు అయ్యింది.ఈ రెండు క్లిప్పులు.. ట్రంప్ పై చర్యలకు కొత్త అవకాశాల్ని కల్పిస్తున్నట్లుగా చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.