Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్: ఇక లైసెన్స్ వెంట‌తీసుకువెళ్ల‌క్క‌ర్లే!

By:  Tupaki Desk   |   11 Aug 2018 7:15 AM GMT
గుడ్ న్యూస్: ఇక లైసెన్స్ వెంట‌తీసుకువెళ్ల‌క్క‌ర్లే!
X
వాహ‌న‌చోద‌కుల‌కు ఓ తీపిక‌బురు. ఇక మీదట బయటకు వెళ్లినప్పుడు మీ వెంట తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ - వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు - ఇన్స్యూరెన్స్ కాగితాలు తీసుకెళ్లకపోయినా ఫర్వాలేదు. ``అదెలా? ప‌్ర‌తిచోటా పోలీసులు త‌నిఖీలు మామూలు అయిపోయిన సంద‌ర్భంలో లైసెన్స్ లేక‌పోతే ఇంకేమైనా ఉందా?`` అని ఆశ్చ‌ర్య‌పోకండి. లైసెన్స్ లేక‌పోయినా...స‌ద‌రు ప‌త్రాలు డిజిలాకర్‌ లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీచేసింది.

డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీ డిజిలాక‌ర్‌ యాప్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా డిజిట‌ల్ జ‌మానా వ‌చ్చేసిన‌ప్ప‌టికీ...ఇప్పటివరకూ డిజిలాకర్‌ లో వాహనాలకు సంబంధించి ఎటువంటి పత్రాలను చూపించినా పోలీసులు అంగీకరించలేదు. దీంతో కొందరు కేంద్ర రవాణా శాఖకు ఫిర్యాదులు చేశారు. ఇప్పటికే బీహార్ - మధ్యప్రదేశ్ - కర్ణాటక రాష్ర్టాల్లో డిజిలాకర్‌ లో ఉన్న పత్రాలను లీగల్ డాక్యుమెంట్లుగా పరిగణిస్తున్నారని - మిగతా చోట్ల పోలీసులు అంగీకరించడం లేదని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో స్పందించిన కేంద్ర రవాణా శాఖ డిజిలాకర్‌ లోని పత్రాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన ఏ పత్రాలనైనా డిజిలాకర్ యాప్ లేదా ఎంపరివాహన్ మొబైల్ యాప్‌ లో భద్రపరుచుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఆపినప్పుడు ఒరిజినల్ పత్రాలకు బదులు డిజిలాకర్‌ లో ఉన్న వాటిని చూపిస్తే సరిపోతుంది. కేంద్ర రవాణా శాఖ ఆదేశాల ప్రకారం ఈ నిబంధన శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చింది.