Begin typing your search above and press return to search.

అసలే అవినీతి శాఖ..ఇంత విచ్చలవిడిగానా..?

By:  Tupaki Desk   |   6 Sep 2015 6:00 AM GMT
అసలే అవినీతి శాఖ..ఇంత విచ్చలవిడిగానా..?
X
అసలే ఆ శాఖ ప్రస్తుతం రాష్ట్రంలోనే అవినీతికి పేరుమోసిన డిపార్టుమెంటుల్లో అగ్ర శ్రేణి లోనే ఉన్నది. ఆ శాఖలో లెక్కకు మిక్కిలిగా జరుగుతున్న అవినీతి గురించి ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా బెంబేలెత్తిపోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరీ విచ్చలవిడితనం పెరిగిపోయిందని ఆయన స్వయంగా అక్షింతలు వేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఆ శాఖకు మాత్రం చీమకుట్టినట్లయినా ఉన్నట్లు లేదు. ముఖ్యమంత్రి హెచ్చరికల పట్ల ఏ మాత్రం ఖాతరు ఉన్నట్లు లేదు. యథేచ్ఛగా తమ విచ్చలవిడితనాన్ని కొనసాగిస్తున్నారు. ఆ శాఖ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కాగా, తాజాగా ట్రాన్స్‌ ఫర్లు, ప్రమోషన్ల కు సంబంధించి ఒకే రోజు 97 జీవో ఉత్తర్వుల ద్వారా నిర్ణయాలు తీసుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. ఈ శాఖలోని అధికారులు తృటిలో సెంచరీ మిస్సయ్యారని సెక్రటేరియేట్‌ లో జోకులు వేసుకుంటున్నారు.

చంద్రబాబునాయుడు ఇటీవల ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షించినప్పుడు.. టాప్‌ ఫోర్‌ అవినీతి శాఖల జాబితాలో మూడో ర్యాంకును వైద్య ఆరోగ్య శాఖ కే కట్టబెట్టారు. దీనికి భాజపాకు చెందిన కామినేని శ్రీనివాస్‌ సారథ్యం వహిస్తున్నారు. అవినీతికి అడ్డుకట్ట వేసి, పారదర్శకతతో నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు హితోపదేశాలు చేసి రెండు రోజులు కూడా గడవ లేదు. అప్పుడే.. సదరు వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల జాతర జరిగిపోయింది.
సాధారణ బదిలీలు కాకుండా.. హైలెవెల్‌ ఒత్తిడులు పైరవీల నేపథ్యంలో జరిగే బదిలీలకోసం ప్రత్యేకంగా జీవో ఇవ్వడం సహజం. అసలే వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి తాండవిస్తున్నదని ఒకవైపు సీఎం చెబుతోంటే.. మరోవైపు శనివారం నాడు.. ఇలాంటి హైలెవల్‌ ఒత్తిళ్లతో (!) ఉండగల ట్రాన్స్‌ ఫర్లు, ప్రమోషన్ల కు సంబంధించి 97 జీవోలు ఇచ్చేశారు. ఈ శాఖ స్పెషల్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ ఉత్తర్వులు ఇచ్చారు. వీటిలో చాలా వరకు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ స్థాయి డాక్టర్లకు సంబంధించినవే అని వార్తలు వస్తున్నాయి.

అవినీతికి నిలయం అంటూ చంద్రబాబు ఈ శాఖ పనితీరుమీద ఫోకస్‌ పెట్టిన నేపథ్యంలో.. ఈ శాఖలోని పెద్ద తలకాయల మీదనే త్వరలోనే వేటు పడే ప్రమాదం ఉండొచ్చునని.. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే ఉద్దేశంతోనే వారు హడావుడగా ఒకేరోజు ఇన్ని జీవోలతో బదిలీల పర్వాన్ని పూర్తి చేయించేశారని సచివాలయంలో గుసగుసలాడుకుంటున్నారు.