Begin typing your search above and press return to search.

ప్రశాంత తెలంగాణ.. ఏమైందిలా?

By:  Tupaki Desk   |   5 Nov 2019 5:34 AM GMT
ప్రశాంత తెలంగాణ.. ఏమైందిలా?
X
రెండు తెలుగు రాష్ట్రాలను పోలిస్తే కొంత ప్రశాంతమైన వాతావరణం తెలంగాణలో ఉండేది. 2014లో రెండు రాష్ట్రాలు విడిపోయాక ఏపీలో రాజధాని కూడా లేకపోవడం.. ఆపసోపాలు పడడం.. అప్పటి ప్రతిపక్ష నేత జగన్ గట్టిగా ఉండడం.. ఇక అమరావతి నిర్మాణం సహా రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతలు చంద్రబాబుకు ఉండడంతో కొంత బిజిబిజీ వాతావరణం నెలకొని ఉండేది.

ఇక 2014కు ముందు వరకూ తెలంగాణ ఉద్యమంతో అల్లకల్లోలంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర విభజనతో బాగా సద్దు మణిగింది. కేసీఆర్ గద్దెనెక్కడం.. ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ముందుకు వెళ్లడం.. ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండ ఎగరడం.. ప్రతిపక్షాలు బలహీనమవ్వడంతో ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది.

ఏపీలో చంద్రబాబు హయాం నుంచి నేటి జగన్ హయాం వరకూ ఏదో ఒక లొల్లితో నిత్యం వార్తల్లో ఉంటూ వస్తోంది. ప్రస్తుతం ఇసుక కొరతపై ప్రతిపక్షాల గొడవ, సీఎస్ బదిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

ఇక తెలంగాణలో ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని సీఎం కేసీఆరే చెడగొడుతున్నారన్న వాదనను పొలిటికల్ విశ్లేషకులు తెరపైకి తెస్తున్నారు. టీఎస్ ఆర్టీసీ సమ్మెకు స్వయంగా టీఆర్ఎస్ అనుబంధ టీఎంయూ పిలుపునివ్వడం.. టీఆర్ఎస్ నేత అశ్వత్థామరెడ్డి పోరు సల్పడం మొదలెట్టారు. నిజానికి ఆర్టీసీ కార్మికులను పిలిచి పరిస్థితి వివరించి కేసీఆర్ మాట్లాడి.. కొంచెం సర్ధిచెబితే ఇప్పుడు ఆర్టీసీ సమ్మె ఇక్కడి దాకా వచ్చి ఉండేది కాదన్న చర్చ సాగుతోంది.

ఇక కేసీఆర్ తెచ్చిన రెవెన్యూ సంస్కరణలు కూడా ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగులపై ప్రజల్లో కోపానికి కారణమవుతున్నాయి. రెవెన్యూలో అవినీతి పెరిగిపోయిందని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం.. దాన్ని ప్రక్షాళన చేస్తామని.. వీఆర్వోల అవినీతిపై కథలు చెప్పడంతో సహజంగా ప్రజల్లో రెవెన్యూ అధికారులపై కోపం పెరిగింది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో సురేష్ అనే నిందితుడు పట్టా ఇవ్వనందుకు తహసీల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేశాడు. ఇలా ప్రశాంత తెలంగాణలో కేసీఆర్ వైఖరే చెడగొడుతున్న వాతావరణం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.