Begin typing your search above and press return to search.

నీళ్ల గ్లాస్ లో నీళ్లు ఒలకనంత స్మూత్ గా రైలు ప్రయాణం

By:  Tupaki Desk   |   1 Nov 2020 10:00 AM IST
నీళ్ల గ్లాస్ లో నీళ్లు ఒలకనంత స్మూత్ గా రైలు ప్రయాణం
X
గతంలో ఎప్పుడూ లేనంతగా రైలు ప్రయాణాన్ని అస్వాదించొచ్చు. పేరుకు ట్రైన్ జర్నీనే కానీ.. అకస్మాత్తుగా కుదుపులతో ఉక్కిరిబిక్కిరి కావటమే కాదు.. గరిష్ఠ వేగంతో రైలు ప్రయాణించే వేళ.. బాత్రూంలో సరిగా నిలబడలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి ఇబ్బందులు ఇకపై ఉండవని చెబుతోంది భారతీయ రైల్వే. తాజాగా చేపట్టిన చర్యల కారణంగా.. నిండుగా ఉన్న నీళ్ల గ్లాస్ ఏ మాత్రం ఒలికిపోనంత స్మూత్ గా రైలు ప్రయాణం ఉండనున్నట్లు చెబుతున్నారు కేంద్ర రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయిల్.

అయితే.. ఇది అన్ని రూట్లలో కాదు సుమా. ఎంపిక చేసిన రూట్లలోనే ఇలాంటి పరిస్థితి. కరోనా మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో.. పెండింగ్ పనుల్ని.. డెవలప్ మెంట్ పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది రైల్వే శాఖ. కర్ణాటకలోని బెంగళూరు - మైసూర్ నగరాల మధ్య ట్రాక్ కు సంబంధించి ఇటీవల చేపట్టిన చర్యలతో ఆ రూట్లో రైలు ప్రయాణం ఎలాంటి కుదుపులు లేకుండా ఎంజాయ్ చేయొచ్చని చెబుతున్నారు.

దాదాపు 130 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మార్గాన్ని రూ.40 కోట్ల వ్యయంతో నిర్వహణ పనులు పూర్తి చేశారు. దీంతో గరిష్ఠ వేగంలోనూ రైలు ఎలాంటి కుదుపులకు లోను కాదు. ఈ విషయాన్ని ఉత్త మాటలతో కాకుండా.. ఒక వీడియోను పోస్టు చేసి మరీ.. మారిన రైలు ప్రయాణం ఏ రీతిలో ఉందన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కేంద్ర రైల్వే మంత్రి షేర్ చేసిన ఈ చిట్టి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.