Begin typing your search above and press return to search.

అమెరికాలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి

By:  Tupaki Desk   |   1 Jun 2017 1:00 PM GMT
అమెరికాలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి
X
అమెరికాలో మ‌రో విషాద‌క‌ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. అమెరికాలోని నార్త్‌విల్లీలో తెలుగు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు నాగరాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని మూడేళ్ల కొడుకు అనంతసాయి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోగా, కొడుకుని కాపాడుకునేందుకు స్విమ్మింగ్‌పూల్‌లో దూకడంతో మృతిచెందినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలోని నాగరాజు ఇన్ఫోసిస్‌లో సంస్థ‌లో వ‌ర్క్ వీసాపై ఉద్యోగం చేస్తున్నారు. భార్య బిందు, కుమారుడు అనంతసాయితో కలిసి నాగరాజు మూడేళ్ల నుంచి నార్త్‌విల్లీలో ఉంటున్నారు. సైకిల్‌ తొక్కుతూ అనంతసాయి కొలనులో పడినట్లు అనుమానిస్తున్నారు. కుమారుణ్ని కాపాడే యత్నంలో నాగరాజు మృత్యువాత పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా కొల‌నులో ఓ మృత‌దేహం తేలియాడుతున్న విష‌యాన్ని గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అనంత‌రం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్ట‌గా నాగ‌రాజు, అత‌ని కుమారుడి మృత‌దేహం ల‌భ్య‌మైన‌ట్లు తెలుస్తోంది.

కాగా మృతుడి కుటుంబ సభ్యుల‌కు స‌హాయం అందించేందుకు స‌హాయం చేసేందుకు స్థానికులు ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. www.gofundme.com ద్వారా చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మానికి 40,000 అమెరిక‌న్ డాల‌ర్ల నిధులు అందాయి. అమెరికన్ తెలంగాణ అసోసియేష‌న్ త‌ర‌ఫున నాగ‌రాజు కుటుంబ స‌భ్యుల‌కు స‌హాయం చేసేందుకు త‌మ ప్ర‌య‌త్నాల‌ను మొద‌లు పెట్టిన‌ట్లు ఆ సంఘం అధ్య‌క్షుడు రామ్ మోహ‌న్ కొండా తెలిపారు. నాగరాజు వ‌డ్ల‌మూడిలోని విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ లో, మాజెటి గురువ‌య్య కాలేజీ పూర్వ విద్యార్థి.