Begin typing your search above and press return to search.

పెద్ద నోట్ల ర‌ద్దు ఎఫెక్ట్‌... హైవేల‌పై ట్రాఫిక్ జామ్‌

By:  Tupaki Desk   |   9 Nov 2016 5:42 AM GMT
పెద్ద నోట్ల ర‌ద్దు ఎఫెక్ట్‌... హైవేల‌పై ట్రాఫిక్ జామ్‌
X
దేశ‌వ్యాప్తంగా రూ.500 - రూ.1,000 క‌రెన్సీ నోట్ల ర‌ద్దు గంట‌ల వ్య‌వ‌ధిలోనే త‌న ప్ర‌భావం చూప‌డం మొద‌లైంది. పెద్ద నోట్ల ర‌ద్దుతో నిన్న రాత్రి నుంచే వెయ్యి - 500 నోట్ల‌ను తీసుకునేందుకు ప‌లు వ్యాపార సంస్థ‌లు - కిరాణా షాపులు - పెట్రోల్ బంకులు నిరాక‌రించాయి. ఈ నోట్ల‌ను తీసుకునేందుకు సిద్ధ‌ప‌డిన పెట్రోల్ బంకులు... చిల్ల‌ర లేద‌ని - ఇచ్చిన నోటుకు స‌రిప‌డా పెట్రోల్ లేదంటే డీజిల్ పోయించుకోవాల్సిందేన‌ని తెగేసి చెప్పారు. త‌మ వ‌ద్ద చిల్ల‌ర లేని కార‌ణంగానే ఇలా చేయాల్సి వ‌స్తోంద‌ని వారు చెప్పుకొచ్చారు. పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల పరిస్థితి ఎలా ఉంటుంద‌న్న విష‌యం తెల్లారేస‌రికి తెలిసొచ్చింది. ప్ర‌ధాన ర‌హ‌దారుల‌పై ఉన్న టోల్ గేట్ల వ‌ద్ద పెద్ద నోట్ల‌ను అంగీక‌రించడం లేదు. చిల్ల‌ర ఇచ్చేందుకు స‌రిప‌డ నోట్లు వాహ‌న‌దారుల వెయ్యి - 500 నోట్లు త‌ప్పించి ఇత‌ర నోట్లు లేవు. దీంతో దేశ‌వ్యాప్తంగా దాదాపుగా అన్ని జాతీయ ర‌హ‌దారుల‌పై ఉన్న టోల్ గేట్ల వ‌ద్ద భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. చిత్తూరు జిల్లా తిరుప‌తి స‌మీపంలోని వ‌డ‌మాల పేట టోల్ గేట్ వ‌ద్ద నెల‌కొన్న‌ ప‌రిస్థితి... పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌భావానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తోంద‌ని చెప్పొచ్చు.

ప్ర‌స్తుతం వ‌డ‌మాల పేట టోల్ గేట్ వ‌ద్ద కిలో మీట‌ర్ల మేర వాహ‌నాలు నిలిచిపోయాయి. వెయ్యి - 500 నోట్ల‌ను టోల్ గేట్ సిబ్బంది నిరాక‌రిస్తున్నారు. అయితే ఈ రెండు డినామినేష‌న్ నోట్లు మిన‌హా ఇత‌ర నోట్లు లేని వాహ‌న‌దారులు ప్ర‌యాణం మ‌ధ్య‌లో తామెలా ఇత‌ర డినామినేష‌న్ నోట్ల‌ను తీసుకురాగ‌ల‌మంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దాదాపుగా జాతీయ ర‌హదారుల‌పై ఉన్న టోల్ గేట్ల వ‌ద్ద కూడా ఈ త‌ర‌హా ప‌రిస్థితులే నెల‌కొన్నాయి. ఇదిలా ఉంటే.. రాత్రికి రాత్రే అమ‌ల్లోకి వ‌చ్చిన పెద్ద నోట్ల ర‌ద్దు కార‌ణంగా జ‌నం చిల్ల‌ర స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యం వెలువ‌డిన వెంట‌నే ఏటీఎంల‌కు ప‌రుగులు పెట్టిన జ‌నంతో ఆయా ఏటీఎంల వ‌ద్ద భారీ క్యూలు క‌నిపించాయి. అయితే జ‌నం ఆశించిన మేర చిల్ల‌ర ఏటీఎంల నుంచి రాలేదు. దీంతో నిత్యావ‌స‌రాల కొనుగోలుకు కూడా జ‌నం ఇబ్బంది ప‌డుతున్నారు. ఇదే అద‌నుగా చిల్ల‌ర వ‌ర్త‌కులు చేతివాటం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప‌ది శాతం మేర డిమాండ్ చేస్తూ చిల్ల‌ర ఇస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. వెరసి పెద్ద నోట్ల ర‌ద్దుతో మ‌రో రెండు, మూడు రోజులు జ‌నానికి ఇబ్బందులు త‌ప్పేలా లేవు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/