Begin typing your search above and press return to search.

ఈకామర్స్ పండుగ ఆఫర్లను నిషేధించండి

By:  Tupaki Desk   |   14 Sep 2019 10:02 AM GMT
ఈకామర్స్ పండుగ ఆఫర్లను నిషేధించండి
X
పండుగలు వచ్చాయంటే అందరికీ సంబరమే.. దసరా, దీపావళి, క్రిస్మస్ ఇలా ఈ ఏడాది ఎండింగ్ లో వచ్చే ఈ పండుగలను జనాలు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ వేళనే భారీగా షాపింగ్ చేస్తుంటారు. తమ తమ నగరాలు, పట్టణాల్లో వస్త్రాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు - ఇంటికి సంబంధించినవన్నీ కొనుగోలు చేస్తుంటారు.

పండుగలకు కొనే జనాల అభిరుచిని ఆసరాగా చేసుకొని ప్రఖ్యాత ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్ - అమేజాన్ భారీగా ఆఫర్లను ప్రకటించాయి. బిగ్ బిలియన్ సేల్స్ అంటూ ఏకంగా వస్తువులపై 10-80శాతం వరకూ భారీ తగ్గింపును ఇస్తున్నట్టు తాజాగా ప్రకటించాయి.

దీంతో ఈ భారీ తగ్గింపు ధరలతో దేశీయ రిటైల్ మార్కెట్ కుదేలవుతుందని.. ఈ అమేజాన్ - ఫ్లిప్ కార్ట్ పండుగ ఆఫర్లను నిషేధించాలని తాజాగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. భారీ డిస్కౌంట్లతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను అతిక్రమిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ మేరకు లేఖలో ఈకామర్స్ పండుగ ఆఫర్లను నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరాయి.

ఈ దసరాకు ముందు భారీ ఆఫర్లు ఇచ్చిన ఫ్లిప్ కార్ట్, అమేజాన్ లకు సీఏఐటీ డిమాండ్ శరాఘాతంగా మారింది. ప్రభుత్వం కనుక దేశీయ రిటైల్ ట్రేడర్స్ వినతిని పరిగణలోకి తీసుకుంటే ఈ కామర్స్ కు భారీ నష్టం తప్పదు. మరి ప్రభుత్వం ఏం నిర్ణయిస్తుందనేది వేచిచూడాలి.