Begin typing your search above and press return to search.

అమెరికా-చైనా పోరు.. మధ్యలో నలిగిపోతున్న యాపిల్

By:  Tupaki Desk   |   27 Aug 2019 5:40 AM GMT
అమెరికా-చైనా పోరు.. మధ్యలో నలిగిపోతున్న యాపిల్
X
గెలుపే కానీ ఓటమి అన్నది తెలీనట్లుగా ఉంటుంది యాపిల్ వ్యవహారం. ఆ సంస్థ విడుదల చేసే ఏ వస్తువైనా సరే.. మార్కెట్లో విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఇక.. ఆ షేరు ధర ఆకాశాన్ని చూడటమే కానీ.. నేల వైపు చూసేందుకు ఏ మాత్రం ఇష్టపడదు. యాపిల్ కు కష్టాలన్నవి ఉండవా? అన్ని విజయాలేనా? సవాళ్లు.. సమస్యలు ఎదురుకావా? అని ఫీలయ్యే వారందరి కోరిక తీరిపోయినట్లే. తాజాగా అమెరికా - చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య వార్.. అటొచ్చి.. ఇటొచ్చి ఇప్పుడు యాపిల్ సంస్థకు పెద్ద తలనొప్పిగా మారటమే కాదు.. భారీగా ఆర్థిక నష్టాన్ని నమోదయ్యేలా చేస్తోంది.

రెండు అగ్రదేశాల మధ్య నలిగిపోతున్న యాపిల్ కష్టాలు.. కనుచూపు మేర తగ్గే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది. సొంత దేశాధ్యక్షుడి ఘీంకారం.. మరోవైపు మొత్తంగా ఆధారపడిన డ్రాగన్ గర్జనల మధ్య ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి అన్న చందంగా యాపిల్ పరిస్థితి మారింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో యాపిల్ కంపెనీ విలువ ఏకంగా 44 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

ఎందుకిలా అంటే.. యాపిల్ సంస్థ మొత్తం తన ఫోన్ల తయారీ వ్యవహారాన్ని చైనాలోనే పెట్టుకుంది. ఐఫోన్ల ఉత్పత్తి చైనా కేంద్రంగా చేస్తోంది. దీంతో.. అమెరికా - చైనాల మద్య నడుస్తున్న సుంకాల వార్ వేళ.. ట్రంప్ తమ దేశ కంపెనీలన్నీ చైనా నుంచి వెనక్కి వచ్చేయాలంటూ ఆర్డర్ వేసేశారు. ఇప్పటికిప్పుడు యాపిల్ చైనాను విడిచి పెట్టి రాలేని పరిస్థితి. అలా రావాలంటే ఆ సంస్థ దారుణంగా దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఐఫోన్లు తయారీలో సింహభాగం చైనాలోనే చేస్తున్నారు.

ఒక అంచనా ప్రకారం కంపెనీ ఉత్పత్తి చేసే ఐఫోన్ల ఉత్పత్తికి సంబంధించి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను చైనా నుంచి వేరే దేశానికి తరలించటానికి ఏకంగా మూడేళ్లు పడుతుందని చెబుతున్నారు. తక్కువలో తక్కువ ఐదు నుంచి ఏడు శాతం వసతుల్ని వేరే దేశానికి మార్చటానికి యాపిల్ కు పట్టే సమయం 18 నెలలు. అలాంటప్పుడు మొత్తం సెటప్ ను మార్చటం అంత తేలికైన విషయం కాదు. దీంతో.. ఏం చేయాలో యాపిల్ కు పాలుపోవటం లేదు.

చైనా నుంచి ఉత్పత్తిని వేరే దేశానికి మారిస్తే.. వచ్చేసమస్యలు బోలెడన్ని అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. నైపుణ్యం ఉన్న ఉద్యోగులు.. తక్కువ ధరలో ముడిపదార్థాలు చైనా కాకుండా వేరే దేశంలో దొరకటం కష్టమంతున్నారు. ఒకవేళ తరలించాల్సి వస్తే.. భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని.. అదే జరిగితే ఉత్పత్తి వ్యయం పెరిగి యాపిల్ వస్తువుల ధరలు పెరిగిపోవటం ఖాయమంటున్నారు.

యాపిల్ కు వచ్చే కష్టాలు ఇలా ఉంటే.. ఆ కంపెనీ కానీ చైనాను వీడిపోయిన పక్షంలో డ్రాగన్ కు పడే దెబ్బ మామూలుగా ఉండదంటున్నారు. ఎందుకంటే.. చైనాలోని ప్రైవేటు ఉద్యోగ కల్పనలో యాపిల్.. దాని అనుబంధం సంస్థలదే ఎక్కువ భాగం. ఇలాంటప్పుడు యాపిల్ కానీ తన ఉత్పత్తిని తగ్గించుకుంటే నిరుద్యోగం భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరీ ఈతిబాధల నుంచి యాపిల్ ఎలా బయటపడుతుందో చూడాలి.