Begin typing your search above and press return to search.

ఇండియా గేట్ వద్ద ట్రాక్టర్ దహనం ఎందుకంత సీరియస్?

By:  Tupaki Desk   |   29 Sept 2020 10:15 AM IST
ఇండియా గేట్ వద్ద ట్రాక్టర్ దహనం ఎందుకంత సీరియస్?
X
రాష్ట్రాల్లో సాగే రాజకీయాలతో పోలిస్తే.. జాతీయ స్థాయి రాజకీయాలు అంతో ఇంతో పరిణితి ఉంటుంది. వ్యక్తిగత.. సైద్ధాంతిక విభేదాల్ని సైతం పక్కన పెట్టి.. కొన్ని విషయాల్లో రాజీ ఫార్ములాకు ప్రయత్నం చేస్తుంటాయి. కేంద్రం తీసుకొచ్చే చట్టాల విషయంలో ప్రతిపక్షం అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు..బలంగా వ్యతిరేకిస్తున్నప్పుడు వాటి వాదనను పరిగణలోకి తీసుకోవటం.. రాజీ ఫార్ములాను రూపొందించటం చేస్తుంటారు.ఇందుకు భిన్నమైన పరిణామాలు ఇటీవల ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులో చోటు చేసుకున్నాయి.

పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లును తాజాగా రాష్ట్రపతి కోవింద్ ఆమోదముద్ర వేసిన వైనంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఓవైపు ఈ వివాదాస్పద బిల్లుపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నా.. తమ వాదనను పరిగణలోకి తీసుకోని వైనాన్ని తప్పు పడుతున్నాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఇండియాగేట్ వద్ద ట్రాక్టర్ ను దగ్థం చేసిన వైనం సంచలనంగా మారింది.

ఎందుకంటే.. ఈ ఘటనకు కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలోనే రాష్ట్రపతి భవన్ ఉండటం గమనార్హం. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమాన్ని పంజాబ్ కు చెందిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాలు పంచుకున్నారు. దాదాపు పదిహేను నుంచి ఇరవై మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక లారీలో ట్రాక్టర్ ను తీసుకొచ్చి.. రోడ్డు మీద దాన్ని దించి.. కాల్చేయటం ద్వారా తమ నిరసనను తెలియజేశారు.

ఇండియాగేట్ వద్ద ట్రాక్టర్ ను తగలబెట్టిన ఘటనను కాంగ్రెస్ సమర్థించుకుంది. అంతేకాదు.. కేంద్రం అమలు చేయనున్న వ్యవసాయ చట్టాన్ని అడ్డుకునేందుకు వీలుగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజ్యాంగంలోని 254(2) అధికరణం కింద ఉన్న అధికారాల్ని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ దిశానిర్దేశం చేశారు.

ఈ అధికరణం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి చొచ్చుకు వచ్చి.. రాష్ట్రాల అధికారాల్ని దెబ్బతీసేట్లుగా కేంద్రం చేసే చట్టాల్ని తోసిరాజనేట్లుగా అసెంబ్లీలు చట్టాలు చేయవచ్చేమో అన్న విషయాన్ని పరిశీలించాలని తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ప్రభుత్వాన్ని సోనియా కోరారు. రాజ్యాంగంలోని అధికారణమే కేంద్ర చట్టాలకు విరుగుడుగా ఆమె అభివర్ణిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సోనియా పేర్కొన్నట్లుగా కేంద్రానికి చెక్ పెట్టేందుకు రాజ్యాంగంలోని 254(2) అధికరణంతో అసెంబ్లీలలో బిల్లులు తేవచ్చని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ చెబుతున్నారు. చూస్తుంటే.. వ్యవసాయ బిల్లు రచ్చ ఇప్పట్లో ముగిసేట్లుగా కనిపించని పరిస్థితి నెలకొందని చెప్పక తప్పదు.