Begin typing your search above and press return to search.

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో రేవంత్ కు తెలుసు!

By:  Tupaki Desk   |   6 July 2021 5:30 PM GMT
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో రేవంత్ కు తెలుసు!
X
'ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు' అని ఒక పాపులర్ సినిమా డైలాగ్ ఉంది. ఇప్పుడు దాన్నే ఫాలో అయిపోతున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అవును కొత్తగా నియామకమైన రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ సీనియర్లు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు . ఇప్పటికే కోమటిరెడ్డి కాంగ్రెస్ వ్యవహారాలకు దూరం జరగగా.. ఉత్తమ్ అస్సలు కనిపించడం లేదు. వీహెచ్ ఆస్పత్రి పాలయ్యారు. మిగతా నేతలు అసలు గాంధీ భవన్ వైపు చూడడం లేదు.

టీడీపీ నుంచి మూడేళ్ల క్రితం వచ్చిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ చేయడంపై అనాధిగా కాంగ్రెస్ లో ఉంటున్న సీనియర్ నేతలు తట్టుకోవడం లేదు. ఇప్పటికే జగ్గారెడ్డి, జానారెడ్డి సహా సీనియర్లను కలిసి బుజ్జగిస్తున్న రేవంత్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టివిక్రమార్కను సైతం బుజ్జగించారు. ఇందుకోసం ఆయన అన్నయ్య మల్లు రవిని వాడుకున్నాడు. మల్లు రవిని గతంలో రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ కృతజ్ఞతతోనే మల్లు రవితో ఆయనకు స్వయాన తమ్ముడైన భట్టి విక్రమార్కను బుజ్జగించే ప్రయత్నం చేశాడు రేవంత్. ఇది వర్కవుట్ అయ్యింది.

టీపీసీసీ చీఫ్ గా నియామకం అయిన రేవంత్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవి రంగంలోకి దిగారు. రేవంత్ గతంలో తన గెలుపుకోసం చేసిన కృషికి ఇప్పుడు రుణం తీర్చుకుంటున్నాడట.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాగానే తీవ్రంగా వ్యతిరేకించిన నేతల్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఒకరు. ఆయన రేవంత్ ను పీసీసీ చేయడాన్ని జీర్ణించుకోలేదు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబును పీసీసీ చీఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేయడంతో మల్లు భట్టి విక్రమార్క తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు.

ఈ క్రమంలోనే తన తమ్ముడు భట్టి విక్రమార్క ను బుజ్జగించేందుకు ఆయన అన్న మల్లురవి రంగంలోకి దింపాడు రేవంత్ రెడ్డి. భట్టితో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో పీసీసీ ఎంత ముఖ్యమో.. సీఎల్పీ నేత కూడా అంతే ముఖ్యమని.. పీసీసీ, సీఎల్పీ రెండు కళ్ల లాంటి వాంటివి అని తమ్ముడు భట్టికి అన్న మల్లు రవి వివరించారట.. భట్టి తన తమ్ముడు అని.. సోనియాగాంధీ నిర్ణయం మేరకు పనిచేయాలని సూచించినట్టు మల్లు రవి తెలిపారు.

గతంలో రేవంత్ రెడ్డి కుటుంబం తాను ఎంపీగా గెలవడానికి పనిచేసిందని.. అందుకే తాను రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచానని మల్లు రవి చెబుతున్నారు. ఇక మల్లు రవి బుజ్జగింపుతో మల్లు భట్టి విక్రమార్క సైతం మారాడు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కూడా భట్టిని కలిశాడు. గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డిని కలవడానికి భట్టి విక్రమార్క నిరకరిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం భట్టిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాగానే మల్లు రవి చర్చలు జరిపారు. అవి ఫలించాయి.

ఆ తర్వాత మల్లు రవితో కలిసి రేవంత్ రెడ్డి స్వయంగా భట్టి విక్రమార్కను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. రేపు గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.అనంతరం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. పీసీసీ, సీఎల్పీ కాంగ్రెస్ పార్టీకి జోడెద్దులలాంటివని.. మేం కలిసి పనిచేస్తేనే కార్యకర్తల కష్టాలు తీరుతాయని చెప్పారు. సోనియా లక్ష్యాన్ని నెరవేరుస్తామన్నారు.

ఇక భట్టి విక్రమార్క మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా ఆ నాటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ లక్ష్యాలను చేరుకుందామని విజ్ఞప్తి చేశారు. అందుకోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ కు విజయాలు సాధించాలని కోరుతూ అభినందనలు తెలిపారు.

ఇక అనంతరం తనను వ్యతిరేకించిన శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబును కలిసి తనకు మద్దతివ్వాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు రేవంత్ ను సన్మానించి కూల్ అయ్యారు.

మొత్తంగా టీ కాంగ్రెస్ సీనియర్లు అందరినీ మెల్లిగా రేవంత్ రెడ్డి అన్ని ఆయుధాలను వాడుతూ బుజ్జగింపులు చేస్తున్నారు. అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరీ..