Begin typing your search above and press return to search.

కనుచూపు మేరలో మోడీకి మంచిరోజులు లేనట్లే

By:  Tupaki Desk   |   10 Nov 2015 11:00 PM IST
కనుచూపు మేరలో మోడీకి మంచిరోజులు లేనట్లే
X
మంచిరోజులు కావాలంటే తనకు ఓటేయాలంటూ భారీగా ప్రచారం చేసి.. దేశ ప్రజల మనసుల్ని దోచుకొని అద్భుతమైన విజయంతో కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు నరేంద్ర మోడీ. అయితే.. ఏడాదిన్నర సమయంలోనే ఆయన తీవ్ర ఇబ్బందుల్లోకి చిక్కుకుపోయారు. తాను అధికారంలోకి వస్తే దేశ ప్రజలకు అన్నీ మంచిరోజులే అని చెప్పిన మోడీ.. తనకు మాత్రం మంచిరోజులు లేకుండా చేసుకోవటం గమనార్హం. అత్యుత్సాహం.. హద్దులు దాటిన ఆత్మవిశ్వాసంతో పాటు.. అహంకార వైఖరి.. అందరిని కలుపుకువెళ్లే ధోరణికి భిన్నంగా తానే సుప్రీం అన్నట్లుగా వ్యవహరించిన వైఖరే.. ఈ రోజు మోడీ ఉన్న పరిస్థితికి కారణంగా చెబుతున్నారు.

కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవటంతోనే అంతా అయిపోదు. పాలన సక్రమంగా జరగాలన్నా.. మోడీ తన ముద్రను వేయాలన్నా.. లోక్ సభలో ఎలా అయితేబలం ఉందో రాజ్యసభలో సైతం బలం ఉండాలి. లేని పక్షంలో కీలక బిల్లుల ఆమోదం పొందే వీల్లేదు. అదే జరిగితే.. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి తిప్పలే తప్పలు. పాలనలో తాము అనుకున్నదేదీ చేయలేని పరిస్థితి అవుతుంది. అప్పుడు.. సంకీర్ణ సర్కారుకు ఎన్ని తిప్పలు ఉంటాయో.. అన్ని తిప్పలు మెజార్టీ ఉన్న మోడీ సర్కారుకు తప్పవు.

దీనికి పరిష్కారం రాజ్యసభలో తన బలాన్ని పెంచుకోవటం. ప్రస్తుతం ఓ మోస్తరుగా బలాన్ని తిరుగులేని అధిక్యం దిశగా తీసుకురావాలంటే రాష్ట్రాల్లో తన బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ఢిల్లీ.. బీహార్ ఎన్నికల్లో కానీ బీజేపీ విజయంసాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉంటే.. రాజ్యసభలో సభ్యుల సంఖ్య పెరిగేందుకు కారణమయ్యేది. కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడటంతో రాజ్యసభలో బలం వచ్చే అవకాశం కోల్పోయినట్లు అయ్యింది. దీనికి తోడు 2016.. 2017లలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఒక్క అస్సాం తప్పించి.. మరే రాష్ట్రంలోనూ బీజేపీ విజయం సాధించే అవకాశాలు లేని నేపథ్యంలో.. రానున్న రెండేళ్లలో రాజ్యసభలో సీట్లు పెరిగే అవకాశం కనిపించట్లేదు.

ఈ అంచనా నిజమైతే.. రానున్న రెండేళ్ల పాటు మోడీ తాను అనుకున్నట్లుగా స్వేచ్ఛగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. తిరుగులేని మెజార్టీ సాధించిన మోడీకి.. తాను అనుకున్నట్లుగా దూసుకెళ్లటానికి వీల్లేని విధంగా రాజ్యసభ పెద్ద స్పీడ్ బ్రేకర్ గా మారనుంది. రాజ్యసభలో మొత్తం 245 సభ్యులు ఉంటే.. ఈ సభలో మెజార్టీ కోసం అవసరమైన బలం 123 మంది సభ్యులు. ప్రస్తుతం.. ఎన్డీయే పక్షానికి 67 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో బీజేపీకి చెందిన సభ్యులు కేవలం 48 మాత్రమే. ఇక.. యూపీఏ కూటమి విషయానికి వస్తే.. 78 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ సభ్యులు 78 కావటం గమనార్హం. ఇక ఇతరుల్లో 89 మంది ఉన్నారు. వీరికి తోడుగా 10 మంది నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. తాను అనుకున్న పనిని పూర్తి చేసుకోవటానికి రాజ్యసభలో తమకున్న బలానికి తోడుగా 56 మంది సభ్యుల బలాన్ని కూడగట్టాల్సి ఉంటుంది. అదెంత కష్టతరమైన విషయమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక..తాజాగా ఫలితాలు వెల్లడైన బీహార్ ఎన్నికల విషయాన్నే చూస్తే.. ప్రస్తుతం రాజ్యసభలో బీహార్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్ నవారు 16మంది సభ్యులు ఉంటే.. వీరిలో 2016లో ఐదురుగు ఎంపీలు రిటైర్ కానున్నారు. వీరంతా జేడీయూకు చెందిన వారు. మరో ఇద్దరు సభ్యులు 2018లో రిటైర్ కానున్నారు. వారిద్దరూ బీజేపీకి చెందిన వారు. తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం కారణంగా బీజేపీకి ఒక్క సీటు మినహా రాజ్యసభలో తన బలాన్ని పెంచుకునే అవకాశం లేదు.

అంటే.. ఉన్న ఇద్దరు రిటైర్ అయితే.. ఒకరిని మాత్రమే మళ్లీ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇక.. 2016లో అస్సాం.. పశ్చిమబెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. 2017లో ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో అస్సాం తప్ప.. మిగిలిన రాష్ట్రాల్లో సానుకూల పరిస్థితులు లేవన్న అంచనాలు వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో.. కనుచూపు మేరలో మోడీకి మంచిరోజులు లేవని చెప్పటం అతిశయోక్తి ఏమీ కాదన్న మాట రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.