Begin typing your search above and press return to search.

దేశంలోనే టాప్ తెలంగాణ.. తెలిస్తే సిగ్గు పడటం ఖాయం

By:  Tupaki Desk   |   13 Dec 2020 4:25 AM GMT
దేశంలోనే టాప్ తెలంగాణ.. తెలిస్తే సిగ్గు పడటం ఖాయం
X
విషయం ఏదైనా మనకు మించినోళ్లు ఉండొద్దు.. అది మంచైనా.. చెడ్డైనా. చూస్తుంటే..తెలంగాణ రాష్ట్రం ఇలాంటి మాటల్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలు వెల్లడయ్యాయి. అందులో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. నోటమాట రాదంతే. ఇంతకీ విషయం ఏమంటే.. మద్యం వినియోగంలో దేశంలోనే అగ్రస్థానాన్ని తెలంగాణ సొంతం చేసుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 27,351 నివాసాల్లోని వారిపై సర్వే నిర్వహించగా.. షాకింగ్ నిజాలుబయటకు వచ్చాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మందుబాబులు భారీగా పెరిగారు. ప్రతి ఇద్దరిలో ఒకరు మద్యానికి అలవాటైన విషయం తాజా సర్వే స్పష్టం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని 49 శాతం మంది పురుషులు మద్యాన్ని సేవిస్తున్నారు. పట్టణ ప్రాంతంలో ప్రతి ముగ్గురిలో ఒకరు మందు కొడుతుంటే.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రతి ఇద్దరిలో ఒకరు మందుకు అలవాటు పడినట్లుగా తేలింది.

తెలంగాణకు పక్కనే ఉన్న ఏపీలో ప్రతి నలుగురిలో ఒకరు మద్యానికి అలవాటు పడితే.. తెలంగాణలో ఇది మరింత ఎక్కువగా ఉంది. ఇక.. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహించే గుజరాత్ రాష్ట్రంలో అతి తక్కువమంది మద్యం అలవాటు ఉందనిచెప్పాలి. ఆ రాష్ట్రంలో ప్రతి పదహారు మందిలో ఒకరు మాత్రమే మద్యం తాగుతున్నట్లుగా తేల్చారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యాన్ని సేవించే మహిళల విషయానికి వస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతం.. పట్టణ ప్రాంతాల్లో 2.6 శాతం చుక్కేస్తున్నట్లుగా తేల్చారు. తెలంగాణలో 22.3 శాతం పురుషులు.. 5.6 శాతం మహిళలు పొగాకు ఉత్పత్తులకు బానిసలు అయినట్లుగా తేలింది. చూస్తుంటే.. మందుబాబులకు కేరాఫ్ అడ్రస్ గా రాష్ట్రం మారటం.. బంగారు తెలంగాణకు ఏ మాత్రం మంచిది కాదన్న విషయాన్ని ప్రభుత్వం ఎప్పుడు గుర్తిస్తుంది?