Begin typing your search above and press return to search.

దేశాన్ని కుదిపేసిన 5 డైరీలు ఇవే

By:  Tupaki Desk   |   27 Dec 2016 5:36 PM GMT
దేశాన్ని కుదిపేసిన 5 డైరీలు ఇవే
X
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇటీవ‌లి కాలంలో త‌న దూకుడు పెంచి ప్రధాని నరేంద్రమోడీపై నిప్పులు కురిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న కాలంలో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలను ప్రతి బహిరంగ సభలోనూ ప్రస్తావిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా రెండు కంపెనీల డైరీల్లో రాసి ఉన్న అంశాలను చూపుతున్నారు. ఈ అంశాలు భూకంపం కలిగిస్తాయని చెప్తూ వస్తున్నారు. రానున్న రోజుల్లో ఇది ఏ రూపం తీసుకుంటుందన్నది పక్కనపెడితే.. గతంలో కొన్ని ఆరోపణలు.. అందుకు సంబంధించిన డైరీలు మాత్రం రాజకీయంగా భూకంపాన్ని సృష్టించాయి. అందులో ముఖ్యమైన ఐదు కుంభకోణాలను ఒకసారి పరిశీలిస్తే..

-బోఫోర్స్ కుంభకోణం

దేశాన్ని ఒక కుదుపు కుదిపిన బోఫోర్స్ కుంభకోణంపై స్వీడన్‌ లో జరిగిన విచారణకు అత్యంత కీలకంగా ఉపయోగపడినవి డైరీలే. ఈ కేసులో బయటికి వచ్చిన దాదాపు 350 డాక్యుమెంట్లలో అప్పటి బోఫోర్స్ ఎండీ మార్టిన్ ఎర్డో డైరీలోని కీలకమైన సమాచారం కూడా ఉన్నది. ఈ కేసులో నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని నాటి విపక్ష నేత వీపీ సింగ్ పార్లమెంటులో లేవనెత్తారు. ఇది అంతిమంగా 1989లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం ఎన్నికల్లో ఓటమి చెందేందుకు కారణమయ్యింది.

-జైన్ హవాలా కుంభకోణం

1996 - జైన్ హవాలా కుంభకోణంకూడా నాటి కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపివేసింది. దాదాపు 60మంది రాజకీయ నాయకులు - అధికారులు - వ్యాపారుల పేర్లు హవాలా వ్యాపారి ఎస్‌ కే జైన్ డైరీల్లో చోటు చేసుకుని, వారి కెరీర్‌ లను కష్టకాలంలోకి నెట్టింది. నాటి పీవీ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు మాధవరావు సింధియా - వీసీ శుక్లా - బలరాం జక్కడ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇదే కుంభకోణంలో పేరు బయటికి వచ్చిన నాటి బీజేపీ అగ్రనేత ఎల్‌ కే అద్వానీ తన నిర్దోషిత్వం నిరూపితమయ్యేంత వరకు ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. అనంతరం తగిన ఆధారాల్లేవంటూ కేసును కోర్టు కొట్టేసింది.

-రమణ్‌ సింగ్ ఇరుక్కున్నదీ డైరీలతోనే

ఛత్తీస్‌ గఢ్ సీఎం రమణ్‌ సింగ్‌ పై ప్రజా పంపిణీ బియ్యం కుంభకోణంలో కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేసింది కూడా డైరీల ఆధారంగానే. 2014 జూన్ 8న సీఎం ఇంటికి సుమా రు 34 కోట్ల రూపాయలు వెళ్లాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి 2015 మార్చిలో ఆరోపణలు చేశారు. రమణ్‌ సింగ్, ఆయన సన్నిహితులు - వ్యక్తిగత సిబ్బంది ప్రజాపంపిణీ వ్యవస్థలో సరఫరా చేసే బియ్యం విషయంలో అవకతవకలకు పాల్పడి కోట్లలో దండుకున్నారని సింఘ్వి ఆరోపించారు. ఇవన్నీ అప్పటి రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌ కు చెందిన శివ్‌ శంకర్ భట్ డైరీల్లో నమోదై ఉన్నాయి.

వీరభద్రసింగ్ యాపిల్ ఆర్చర్డ్ స్కాం

ఇస్పాత్ ఇండస్ట్రీస్ కార్యాలయాల్లో 2012 డిసెంబర్‌ లో ఐటీ అధికారులు సోదాలు జరిపినప్పుడు నగదు లావాదేవీలు జరిగాయని పేర్కొనే మూడు డైరీలను అధికారులు కనుగొన్నారు. ఆ సమయానికి వీరభద్రసింగ్ (ప్రస్తుత హిమాచల్ సీఎం) మన్మోహన్‌ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రిగా ఉన్నారు. ఎల్‌ ఐసీ ఏజెంట్ ద్వారా జరిగిన మూడు భారీనగదు డిపాజిట్లపై ఐటీ అధికారులు కన్నేసిన సమయంలోనే ఈ సొమ్ము చెల్లింపులు జరిగినట్టు డైరీల్లో రాసి ఉంది. రూ.5 కోట్లను ఆనంద్ అనే ఎల్‌ ఐసీ ఏజెంట్ 2008 - 2011 మధ్యకాలంలో డిపాజిట్లు చేసి తిరిగి అందులోనుంచి రూ.కోటి వీరభద్రసింగ్ హిందూ అవిభక్త కుటుంబం పేరిట జీవితబీమా వన్‌ టైమ్ ప్రీమియం చెల్లింపునకు చెక్ రాశాడు.

మాజీ సీబీఐ బాస్‌ కు మొట్టికాయలు పడిందీ డైరీలతోనే

యూపీఏ హయాంలో జరిగిన భారీ కుంభకోణమైన బొగ్గు గనులు కేటాయింపుల విషయంలో దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు చేశారని సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ మాజీ సీబీఐ డైరెక్టర్ రంజిత్‌ సిన్హాకు మొట్టికాయలేసింది డైరీల ఆధారంగానే. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు హై ప్రొఫైల్ వ్యక్తులను సిన్హా కలిశారని అభియోగం. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ చేస్తున్న జాప్యాన్ని కూడా తప్పుపట్టిన సుప్రీంకోర్టు.. దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించింది. ఈ కేసు కూడా సిన్హా ఇంటికి వచ్చిపోయేవారి వివరాలను నమోదు చేసే విజిటర్స్ డైరీలో ఉన్న అంశాల ఆధారమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/