Begin typing your search above and press return to search.

కరోనాకు తీవ్రంగా ప్రభావితమైన టాప్ 10 దేశాలివే

By:  Tupaki Desk   |   24 March 2020 2:30 AM GMT
కరోనాకు తీవ్రంగా ప్రభావితమైన టాప్ 10 దేశాలివే
X
మొదటి.. రెండు ప్రపంచ యుద్ధాల వేళలో కనిపించని సీన్ ఒకటి.. తాజాగా కరోనాతో ప్రపంచం చేస్తున్న వేళ కనిపిస్తోంది. కంటికి కనిపించే శత్రువుతో మొదటి రెండు ప్రపంచ యుద్ధాలు జరిగితే.. కంటికి కనిపించని శత్రువు.. ఆ మాటకు వస్తే.. కేవలం సబ్బు నీళ్లు.. శానిటైజర్లను సరిగా వినియోగించి.. జాగ్రత్తలు తీసుకుంటే చచ్చిపోయే శత్రువు.. ప్రపంచాన్ని వణికిస్తున్నాడు. అది కూడా పాతిక.. యాభై దేశాల్లో కాదు.. ఏకంగా 192 దేశాలకు పైనే కరోనా కారణంగా తీవ్ర ప్రభావానికి గురయ్యాయి.

మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కరోనా కారణంగా కకావికలమైనట్లుగా పరిస్థితులు చోటు చేసుకున్న టాప్ 10 దేశాలు ఆర్థికంగా బలమైనవి కావటం. ఆ మాటకు వస్తే.. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రెండు దేశాలు కూడా కరోనాకు ఎఫెక్ట్ అయ్యాయి. రోజురోజుకి పెరుగుతున్న కరోనా బాధితుల కేసుల కారణంగా.. ప్రపంచం ఎటువైపు ప్రయాణిస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇప్పటివరకూ కరోనా కారణంగా 3.4లక్షలకు పైగా కేసులు నమోదైతే.. 14,748 మరణాలు చోటు చేసుకున్నాయి. చైనాతో పోలిస్తే.. ఇతర దేశాలకు కరోనా విస్తరించిన తర్వాతే.. రోగుల మరణాల రేటు భారీగా పెరిగిందని చెప్పాలి.

కరోనాకు పుట్టిల్లు అయిన చైనాలో ఆ వైరస్ కారణంగా 3270 మంది మరణిస్తే.. ఇటలీలో ఏకంగా 5476 మంది మరణించారు. ఇప్పటికి రోజుకు వందలాది మంది మరణిస్తున్నారు. ఈ మరణాలకు ఎలా చెక్ పెట్టాలో అర్థం కాక కిందామీదా పడిపోయే దుస్థితి. కరోనా కారణంగా అత్యధిక సంఖ్యలో ప్రజలు మరణిస్తున్న దేశాల్లో ఇటలీ.. చైనా తర్వాత స్పెయిన్ నిలిచింది. తర్వాతి స్థానంలో ఇరాన్ నిలిచింది. ఈ వైరస్ వ్యాపిస్తున్న దేశాల లిస్టులో అగ్రరాజ్యం అమెరికా అంతకంతకూ వేగంగా సాగుతోంది.

ఇప్పటివరకూ అదే పనిగా చైనాను విమర్శించటమే తప్పించి.. తమ దేశంలో కరోనా విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవటంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. కరోనా వైరస్ ను చైనీస్ వైరస్ అన్న మాటను ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేయటం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారే కానీ.. ఆ మహమ్మారి వైరస్ తన దేశ ప్రజల్ని టచ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవటంలో మాత్రం ఆయన సక్సెస్ కాలేకపోయారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ చైనాను తిట్టటమే తప్పించి.. అమెరికాలో ఈ వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టే విషయంలో అడ్డంగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి.

ఇక.. ప్రపంచ వ్యాప్తంగా 3.4 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే.. టాప్ టెన్ దేశాల లెక్క తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. గడిచిన మూడు రోజులుగా వైరస్ పుట్టిల్లు వూహాన్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసు ఒక్కటి నమోదు కాలేదు. అదే సమయంలో మిగిలిన దేశాల్లో మాత్రం వాయు వేగంతో కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో పాటు.. ఇప్పటివరకూ మరణాలు భారీగా చేసుకున్న దేశాల వారీగా చూస్తే..

దేశం పాజిటివ్ కేసులు ఇప్పటికి మరణించిన వారు
1. ఇటలీ 59,138 5,476
2. చైనా 81,093 3,270
3. స్పెయిన్ 29,909 1813
4. ఇరాన్ 21,638 1685
5. ఫ్రాన్స్ 16.018 674
6. అమెరికా 35,070 458
7. యూకే 5,683 281
8. నెదర్లాండ్స్ 4,204 179
9. జర్మనీ 24,873 94
10.సౌత్ కొరియా 8,961 111