Begin typing your search above and press return to search.

ఇట్లు.. మీ నాన్న గారి అభిమానులం..

By:  Tupaki Desk   |   24 Dec 2021 7:00 PM IST
ఇట్లు.. మీ నాన్న గారి అభిమానులం..
X
వైఎస్ జగన్. రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అంటే ఇంటి పేరును బట్టి అని ఇట్టే చెప్పవచ్చు. వైఎస్సార్ గారి అబ్బాయిగానే ఆయన రాజకీయ అరంగేట్రం జరిగింది అని ఏ మాత్రం పాలిటిక్స్ మీద అవగాహన లేని వారు అయినా చెప్పగలరు. జగన్ సైతం వైఎస్సార్ పేరుతోనే ఎంపీగా తొలిసారి గెలిచారు. కాంగ్రెస్ లో ఆయనకు టికెట్ కూడా నాటి ముఖ్యమంత్రి కుమారుడిగానే దక్కింది.

ఇక వైఎస్సార్ చనిపోయాక కాంగ్రెస్ లో ఆయన సీఎం సీటు కోసం ప్రయత్నించారు అంటారు. దానికి కూడా వైఎస్సార్ వారసుడు అన్న ఒకే ఒక కారణం వల్లనే సాధ్యపడింది.

ఇక కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. దాని పేరు కూడా వైఎస్సార్ తోనే. 2019 ఎన్నికల్లో గెలిచేంతవరకూ కూడా వైఎస్సార్ పేరే జగన్ నోట పలికింది. ఆ తరువాత ముఖ్యమంత్రి అయ్యాక కొన్ని పధకాలకు వైఎస్సార్ పేరు పెట్టిన జగన్ అంతకు రెట్టింపు తన పేరుతోనే అనేక పధకాలకు శ్రీకారం చుట్టారు. జగన‌న్న అంటూ చాలా పధకాలను తీసుకువస్తున్నారు. ఒక విధంగా ఇపుడు ఏపీ రాజకీయాల్లో జగనన్న అంటేనే బాగా తెలుసేమో.

అయితే జగన్ ఇంతటి స్థాయికి రావడం వెనక వైఎస్సార్ ఉన్నాయి. జగన్ సైతం తండ్రి ఆశయాలను నెరవేరుస్తామనే చెప్పుకున్నారు. జనాలు కూడా రాజన్న బిడ్డ అనే ఆయనకు ఓటేశారు. జగన్ రెండున్నరేళ్ల పాలన పూర్తి చేశారు. అయితే పాలనలో ఎక్కడా రాజన్న ముద్ర అయితే కనబడడంలేదని వైఎస్సార్ అభిమానులు అంటున్నారు అంటే ఆలోచించాల్సిందే మరి.

వైఎసార్ అయిదేళ్ల పాలన చూస్తే ఆయన కక్ష పూరిత రాజకీయాలకు ఏనాడూ పాల్పడలేదు, ఇక తనకు ఆదరించని వారిని అలాగే వదిలేశారు. ఇక తనను నమ్ముకున్న వారినే కాదు, తనను శరణు కోరిన వారిని కూడా సమాదరించారు. అలాంటి వారు శత్రు పక్షమా స్వపక్షమా అన్న ఆలోచనను ఆయన ఏనాడు పడలేదు. ఇక వైఎస్సార్ ఉద్యోగ వర్గాలతో సహా అందరినీ బాగా చూశారు, ఇక ఒక పొరపాటు ఎక్కడైనా జరిగితే దానిని ఆయన మరోసారి రిపీట్ చేసేవారు కాదు.

సంక్షేమం చూస్తూనే అభివృద్ధికి కూడా పెద్ద పీట వేసేవారు. ఇక తనకు రాజకీయంగా కొన్ని విషయాలు నచ్చకపోయినా పార్టీ కోసం తగ్గి ఉండేవారు. అందరూ చెప్పేది వినేవారు, మంచి సలహాదారులను పెట్టుకుని వారి నుంచి సరైన సూచనలు స్వీకరించేవారు. అందుకే ఆయన అయిదేళ్ళ పాలన స్వర్ణ యుగం అయింది.

ఇక్కడ ఒక్క మాట చెప్పుకోవాలి. వైఎస్సార్ అంటే రాజకీయంగా గిట్టని వారు, ఫక్తు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు సైతం ఆయన అయిదేళ్ల పాలన చూసి ఫిదా అయిపోయారు. ఆయనను ఒకసారి జీవితంలో కలసివారు అయితే ఆయన పట్ల తమకు ఉన్న అభిప్రాయాన్ని కూడా మార్చుకునేవారు. అలా కరడు కట్టిన టీడీపీ సహా ఇతర పార్టీల అభిమానులు సైతం వైఎస్సార్ అంటే ఇష్టపడేలా పేరు తెచ్చుకున్నారు.


జగన్ తండ్రి వారసుడిగా అధికారంలో ఉన్నారు. ఆయన మాదిరిగానే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అయితే తండ్రి వ్యవహార శైలిని కూడా పుణికి పుచ్చుకుంటే బాగుంటుంది అని నాన్న గారి అభిమానులు కోరుతున్నారు. నిజానికి వైఎస్సార్ అభిమానులు అంతా జగన్ కి షిఫ్ట్ అయిపోయారు. కానీ జగన్ తీసుకుంటున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాల వల్లనే వారు తాము కేవలం నాన్న గారి అభిమానులనే అని చెప్పుకుంటున్నారు.

మరి ఈ తేడా ఎందుకు వస్తోందో జగన్ ఆలోచన చేయాలి. ఉద్యోగ వర్గాల విషయమే తీసుకుంటే జగన్ సర్కార్ ఇంకా ఏదో చేయాలనే అంటున్నారు. మంత్రుల విషయంలోనూ అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యేలు అయితే సీఎం అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసే సీన్ ఉందని చెప్పుకుంటున్నారు. ఇక పార్టీ క్యాడర్ సంగతి సరే సరి. మరో వైపు కొన్ని వర్గాలు నాడు వైఎస్సార్ కి దూరమే. అలాంటి వాటిని విషయంలో ఆయన వదిలేసేవారు. జగన్ మాత్రం పట్టుదలకు పోతున్నారు అన్న చర్చ అయితే ఉంది.

ముఖ్యంగా టాలీవుడ్ విషయంలో జగన్ వారి మానాన వారిని వదిలేయడమే బెటర్ అన్న సూచన అయితే వుంది. టికెట్ల ధర విషయంలో తక్కువగా ఉన్నాయని అంటున్నారు. వాటిని సరిచేయడం ద్వారా చేతనైన సాయం చేస్తే బాగుంటుంది అన్న సూచనలు ఉన్నాయి.

సినీ వర్గాలకు వరాలు ఇవ్వండి, వారు మీద సానుభూతి చూపించండి అంటూ టాలీవుడ్ సీనియర్ నటుడు జగన్ కి ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేయడం విశేషం. ఆయన చివరన ఇట్లు మీ నాన్న గారి అభిమాని అని పేర్కోండమే గమనార్హం. అంటే తాను వైఎస్సార్ కి మాత్రమే ఫ్యాన్ ని సుమా అని చెప్పినట్లుగా ఉంది కదా. జగన్ కి అభిమానిగా ఆయన మారాలీ అంటే ఏదో చేయాలి కదా.

అలాగే ఇతర వర్గాల విషయంలోనూ ఉంది. అన్ని వర్గాలు రాజన్న బిడ్డలో వైఎస్సార్ ని చూసుకుంటున్నారు. నిజానికి జగన్ కి అది ఎంత వరమో అంత ఇబ్బంది కూడా. ప్రతీ దానికీ వైఎస్సార్ ని పోలిక తెస్తారు. ఆయనది మూడున్నర దశాబ్దాల విశేష రాజకీయ అనుభవం. పైగా ఉమ్మడి ఏపీని ఆయన పాలించారు.

నిధులకు కొదవలేదు, కేంద్రంలో యూపీయే సర్కార్ అండ ఉంది. కానీ జగన్ కి అన్నీ కష్టాలే ఉన్నాయి. దాంతో ఆయన ఏటికి ఎదురీత చేయాలి. అయినా సరే ఉన్నంతలో చేయగలిగినంతలో చేస్తూ ఉండాలి. కొన్ని రంగాలతో వివాదాలు తెచ్చుకోకుండా ఉండడమే మంచిదని ఇట్లు మీ నాన్న గారి అభిమానులమని చెప్పుకునేవారు జగన్ కి సూచిస్తున్నారు. మరి ఇది ఆయన వింటారా. అమలు చేస్తారా. చూడాలి.