Begin typing your search above and press return to search.

తిడితే గానీ... రంగంలోకి దిగ‌రా?

By:  Tupaki Desk   |   30 March 2018 12:21 PM GMT
తిడితే గానీ... రంగంలోకి దిగ‌రా?
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం సాగుతున్న పోరులో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులెవ్వ‌రూ పాలుపంచుకోవ‌డం లేద‌ని, వారికి హోదా అవ‌స‌రం లేదా? వారు ఏపీ వాళ్లు కాదా?.. అంటూ మొన్న‌టికి మొన్న టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. అయితే టాలీవుడ్ కు చెందిన చాలా మంది ప్ర‌ముఖులు హోదా పోరులోకి రాకున్నా... అదే ప‌రిశ్ర‌మ‌కు చెందిన హీరో శివాజీ హోదా పోరులో దాదాపుగా అన్ని వ‌ర్గాల కంటే కూడా ముందున్నార‌నే చెప్పాలి. శివాజీతో పాటు త‌మ్మారెడ్డి భ‌రధ్వాజ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ త‌దిత‌రులు కూడా హోదా పోరులో త‌మదైన పాత్ర పోషిస్తూనే ఉన్నారు. అయినా కూడా మెజారిటీ సినీ ప్ర‌ముఖులు హోదా పోరులోకి రాలేద‌న్న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌... సినిమా వాళ్ల‌ను ఏకిపారేస్తూ చేసిన వ్యాఖ్య‌లు నిజంగానే తెలుగు నేల‌లో పెను సంచ‌ల‌న‌మే రేపాయి. వైవీబీ వ్యాఖ్య‌ల‌పై సినీ ప‌రిశ్ర‌మ భ‌గ్గుమ‌న‌గా... ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే క్ర‌మంలో చంద్ర‌బాబు... వైవీబీకి భారీ క్లాసే పీకారు. ఇదంతా జ‌రిగి ఇంకా ప‌ది రోజులు కూడా కాలేదు. ఇప్పుడిప్పుడే జ‌నం వైవీబీ వ్యాఖ్య‌ల‌ను మ‌రిచిపోతున్నారు.

ఈ క్ర‌మంలో నేటి మ‌ధ్యాహ్నం టాలీవుడ్‌ కు చెందిన సినీ ప్ర‌ముఖులు అవ‌మ‌రావ‌తికి క్యూ క‌ట్టేశారు. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు - అగ్ర నిర్మాత‌లు కేఎల్ నారాయ‌ణ‌ - అశ్వ‌నీద‌త్‌ - కేఎస్ రామారావు - జెమిని కిర‌ణ్ త‌దిత‌రులు హైద‌రాబాదు నుంచి అమ‌రావ‌తిలో వాలిపోయారు. విజ‌య‌వాడ న‌గ‌ర శివారు ఉండ‌వ‌ల్లిలోని సీఎం అధికార నివాసంలో టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడితో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కోసం సాగుతున్న ఉద్య‌మంలో టీడీపీకి బాస‌ట‌గా నిలుస్తామ‌ని వారు బాబుకు హామీ ఇచ్చారు. అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన వారు ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్టాడుతూ ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిలిచేందుకే తాము ఇక్క‌డికి వ‌చ్చామ‌న్నారు. ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన పిలుపు మేర‌కు ఏప్రిల్ 6 దాకా తామూ న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ప్రత్యేక హోదా - విభజన హామీల అమలు కోసం పోరాడం చేస్తున్న చంద్రబాబుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ముఖ్యమంత్రికి బాసటగా ఉంటామన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. మొత్తంగా చంద్ర‌బాబుకు సినీ ప్ర‌ముఖులు మ‌ద్ద‌తు తెల‌ప‌డం వ‌ర‌కు బాగానే ఉంది గానీ... సినిమా వాళ్ల‌కు ప్ర‌త్యేక హోదా ప‌ట్ట‌దా? అంటూ వైవీబీ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల త‌ర్వాత వారు ఇలా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు తెల‌ప‌డంపై రాష్ట్ర ప్ర‌జ‌ల్లో ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌ల‌కు ఆస్కారం ల‌భించిన‌ట్లైంది. మొత్తంగా ఎవ‌రైనా పిలిచే దాకా, ఎవ‌రైనా త‌మ నిష్క్రియాప‌ర‌త్వాన్ని ఎత్తి చూపే దాకా స్పందించ‌మ‌న్న రీతిలో సినీ ప్ర‌ముఖులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న భావ‌న వ‌చ్చేలా వారు వ్య‌వ‌హ‌రించార‌న్న కోణంలో ఇప్పుడు కొత్త ర‌కంగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.