Begin typing your search above and press return to search.

టోక్యో ఒలంపిక్స్ మూడో రోజు ' హైలెట్స్ '.. సత్తా చాటిన పీవీ సింధు, మేరీకోమ్ , మనికా బాత్రా !

By:  Tupaki Desk   |   26 July 2021 4:40 AM GMT
టోక్యో ఒలంపిక్స్ మూడో రోజు  హైలెట్స్ .. సత్తా చాటిన పీవీ సింధు, మేరీకోమ్ , మనికా బాత్రా !
X
ప్రపంచ క్రీడలు టోక్యో ఒలింపిక్స్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ప్రతి అథ్లెట్ తమ దేశం కోసం పతకం సాధించాలని ఉవ్విల్లూరుతున్నారు. ఇకపోతే , టోక్యో ఒలింపిక్స్‌ లో జులై 25న భారత్‌ కు పతకాలేమీ దక్కలేదు. అలాగే పలు క్రీడల్లో భారత్ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఎంసీ మేరీ కోమ్, మణికా బాత్రా, సింధు వంటి ఆటగాళ్లు ఒక వైపు విజయం సాధించారు. గ్రూప్-జే తొలి రౌండ్ మ్యాచ్‌ లో ఇజ్రాయేల్‌ కు చెందిన సెనియా పొలికర్పోవాపై 21-7, 21-10 తేడాతో పీవీ సింధు విజయం సాధించి తర్వాతి రౌండ్‌ కు వెళ్లింది. భారత్ స్టార్ మహిళా బాక్సర్ మేరీ కోమ్ విజయంతో తన ఖాతా తెరిచింది. మ‌హిళ‌ల 51 కేజీల‌ ఫ్లై వెయిట్ కేట‌గిరీ రౌండ్ ఆఫ్ 32లో విజ‌యం సాధించింది. ఆదివారం జరిగిన బౌట్ లో డొమినికాకు చెందిన‌ హెర్నాండెజ్ గార్సియా మిగులినాపై 4-1 తేడాతో గెలిచి రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టింది.

పతకం గ్యారెంటీ గా సాధిస్తుంది అనుకున్న వరల్డ్ నెం.2 ర్యాంకర్ మను బాకర్ నిరాశపర్చింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టర్ విభాగంలో టాప్ - 10 లో చోటు దక్కించుకోలేకపోయింది. దీంతో నెక్ట్స్ రౌండ్లకు అర్హత సాధించలేకపోయింది. వరల్డ్ నెం.1 యశస్విని సింగ్ కూడా 10 మీటర్ల ఎయిర్ పిస్టర్ విభాగంలో నిరాశపర్చింది. 13 వ స్థానంలో నిలిచిన ఈ అథ్లెట్ నెక్ట్స్ రౌండ్లకు అర్హత సాధించలేకపోయింది.

టేబుల్ మెన్స్ సింగిల్స్‌ లో భార త్‌కు చెందిన జ్ఞానేశ్వ‌రన్ స‌త్య‌న్ పోరాటం ముగిసింది. ఆదివారం జ‌రిగిన రెండో రౌండ్ మ్యాచ్‌ లో త‌న కంటే త‌క్కువ ర్యాంక్ ఆట‌గాడు, హాంకాంగ్‌ కు చెందిన లామ్ సియు హాంగ్ చేతిలో 7-11, 11-7, 11-4, 11-5, 10-12, 9-11, 6-11 తేడాతో అత‌డు ఓడిపోయాడు. టెన్నిస్ జోడి సానియా మీర్జా, అంకిత రైనా లు కూడా తమ ఫస్ట్ రౌండ్ లో ఓడిపోయారు. ఉక్రెయిన్ ట్విన్ సిస్టర్స్ నదియా మరియు ల్యుద్మిలా చేతిలో సానియా జోడి 6-0, 6-7, 8-10 తేడాతో ఓడిపోయింది. ఫస్ట్ సెట్ లో అలవోకగా నెగ్గిన భారత జోడి.. ఆ తర్వాత చేతులేత్తేసింది.

పురుషుల లైట్ వెయిట్ డబుల్స్ స్కల్ రీప్ ఛెజ్ విభాగంలో భారత రోయర్లు సెమీ ఫైనల్‌ లోకి అడుగు పెట్టారు. దీనికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న రోయర్లు అర్జున్ లాల్ జాట్, అరవింద్ సింగ్ జోడీ ఈ ఘనతను సాధించింది. అర్జున్ లాల్ జాట్, అరవింద్ సింగ్ జోడీ ఆర్మీ సోల్జర్స్ . జపాన్ సీ ఫారెస్ట్ వాటర్ వేలో నిర్వహించిన ఈ పోటీల్లో ఎవరూ ఊహించని విధంగా విజయ పతాకాన్ని ఎగురవేసింది ఈ జోడీ. పోలెండ్‌ కు చెందిన జెర్జీ కోవాల్స్కీ, అర్థర్ మికోలాజ్చెవ్స్కీ జోడీ తొలి స్థానంలో నిలిచింది. స్పెయిన్ రెండో స్థానాన్ని ఆక్రమించింది

అలాగే టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టుకు గట్టి ఎదురుదెబ్బతగిలింది. వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌ లో మన్‌ ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు 1-7తో చిత్తుగా ఓడింది. ఈ మధ్య రోజుల్లో భారత్‌ ఇంత దారుణంగా ఓడటం ఇదే మొదటిసారి. ఆస్ట్రేలియా తరఫున బ్లేక్ గోవర్స్(40, 42వ నిమిషం) డబుల్ గోల్స్ అందించగా..జేమ్స్ బీల్(12వ నిమిషం), జెరెమీ హేవార్డ్(21వ నిమిషం), ఆండ్రూ ఒగిలివీ(23)వ నిమిషం), జోషువా బెల్ట్జ్(26వ నిమిషం), ట్రిబ్రాండ్(51వ నిమిషం) చెరొక గోల్ నమోదు చేశారు. భారత్ తరఫున దిల్ ప్రీత్ సింగ్(34వ నిమిషం) ఒక్కడే ఏకైక గోల్ సాధించాడు.

టోక్యో ఒలింపిక్స్ 2021లో పాల్గొన్న భారత ఏకైక జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ అంచనాలను అందుకోలేకపోయింది. క్వాలిఫికేషన్ రౌండ్ లో పశ్చిమ బెంగాల్‌ కు చెందిన 26 ఏళ్ల ప్రణతి పూర్తిగా నిరాశపరిచింది. ఆదివారం జరిగిన పోటీలో నాలుగు విభాగాల్లో కలిపి 42.565 స్కోరు మాత్రమే చేసింది. దీంతో 29వ స్థానంలో నిలిచి.. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ పోటీల ఆల్ రౌండ్ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. టాప్ 24 జిమ్నాస్ట్‌లు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధించారు.