Begin typing your search above and press return to search.

టోక్యో ఒలింపిక్స్‌ : ఐదో రోజు హైలెట్స్ ...పతక ఆశలు రేపిన మగువలు !

By:  Tupaki Desk   |   29 July 2021 4:38 AM GMT
టోక్యో ఒలింపిక్స్‌ : ఐదో రోజు హైలెట్స్ ...పతక ఆశలు రేపిన మగువలు !
X
టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతున్నది. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, బాక్సింగ్‌లో పూజారాణి, ఆర్చరీలో దీపికా కుమారి విజయాల బాటలో నడువగా.. సాయి ప్రణీత్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌ పరాజయాలవైపు నిలిచారు. సంచలన ప్రదర్శనతో సెమీఫైనల్‌కు చేరిన భారత రోయర్లు అర్జున్‌ లాల్‌- అర్వింద్‌ సింగ్‌ అదే జోరు కొనసాగించలేకపోగా.. సెయిలింగ్‌లో గణపతి, వరుణ్‌ జోడీ ప్రభావం చూపలేదు. హాకీలో యూరప్‌ జట్లకు దీటుగా బదులిస్తారనుకున్న భారత మహిళలు వరుసగా మూడో మ్యాచ్‌లో ఓటమి పాలయ్యారు.

బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు.. టోక్యో ఒలింపిక్స్‌లో ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన తెలుగమ్మాయి వరుస గేమ్‌లలో నెగ్గి సత్తా చాటితే.. తొలిసారి విశ్వక్రీడల్లో బరిలోకి దిగిన బాక్సర్‌ పూజారాణి క్వార్టర్స్‌కు చేరి శెభాష్‌ అనిపించుకుంది. టీమ్‌ ఈవెంట్‌లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ప్రపంచ నంబర్‌వన్‌ ఆర్చర్‌ దీపిక కుమారి.. వ్యక్తిగత విభాగంలో మెరుగైన ప్రదర్శన చేయగా.. మహిళల హాకీ జట్టు వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. మొత్తంగా వరుసగా బుధవారం భారత్‌ పతకం లేకుండానే ముగించింది.

టీమ్‌ ఈవెంట్‌ లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన స్టార్‌ ఆర్చర్‌ దీపిక కుమారి వ్యక్తిగత విభాగంలో మెరుగైన ప్రదర్శనతో క్వార్టర్‌ ఫైనల్‌ కు చేరుకుంది. బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన ప్రిక్వార్టర్స్‌ లో ప్రపంచ చాంపియన్‌ దీపిక 6-4తో అమెరికా టీనేజర్‌ జెన్నిఫర్‌ ముసినో ఫెర్నాండెజ్‌ పై గెలుపొందింది. అంతకుముందు రౌండ్‌ లో దీపిక 6-0తో కర్మ (భూటాన్‌)ను చిత్తు చేసింది. పురుషుల వ్యక్తిగత విభాగంలో తరుణ్‌ దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌ ఓటమి పాలై ఇంటిబాట పట్టగా , దీపిక భర్త అతాను దాస్‌ నేడు బరిలోకి దిగనున్నాడు.

పెద్దగా అంచనాలు లేకుండా టోక్యోలో అడుగుపెట్టిన రోవర్స్‌ అర్జున్‌ లాల్‌-అర్వింద్‌ సింగ్‌ ద్వయం సంచలన ప్రదర్శనతో సెమీస్‌ కు చేరినా కీలక పోరులో ఆకట్టుకోలేకపోయింది. బుధవారం జరిగిన పురుషుల లైట్‌ వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌ రెండో సెమీస్‌ లో భారత జంట 6 నిమిషాల 24.41 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. కాగా.. ఒలింపిక్స్‌ లో భారత రోవర్స్‌ సెమీఫైనల్‌ కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.

అంచనాలు లేకుండా తొలిసారి విశ్వక్రీడల బరిలోకి దిగిన భారత బాక్సర్‌ పూజారాణి సంచలన ప్రదర్శనతో క్వార్టర్స్‌ కు దూసుకెళ్లింది. మహిళల 75 కేజీల విభాగంలో బుధవారం పూజ 5-0తో ఇచ్రాక్‌ చైబ్‌ (అల్జీరియా)పై విజయం సాధించింది. హర్యానాకు చెందిన 30 ఏండ్ల పూజ.. మూడు రౌండ్‌ లలోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. క్వార్టర్స్‌ లో చైనా బాక్సర్‌ లి కియాన్‌పై విజయం సాధిస్తే.. పూజారాణికి విశ్వక్రీడల్లో పతకం ఖాయం కానుంది.

హాకీలో భారత మహిళల పరాజయాల పరంపర కొనసాగుతున్నది. గత రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన రాణి రాంపాల్‌ బృందం బుధవారం 1-4తో బ్రిటన్‌ చేతిలో ఓటమి పాలైంది. అందివచ్చిన అవకాశాలను చేజార్చుకున్న భారత జట్టు ఏమాత్రం ఆకట్టుకోలేకపోగా.. డిఫెండింగ్‌ చాంపియన్‌ గా బరిలోకి దిగిన బ్రిటన్‌ వరుస గోల్స్‌తో బెంబేలెత్తించింది.

ఇక గురువారం హైలెట్స్ విషయానికొస్తే ... టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. మహిళల సింగిల్స్‌ లో భాగంగా గురువారం డెన్మార్క్ షట్లర్ బ్లిక్‌ ఫెల్ట్‌ తో జరిగిన మ్యాచ్‌లో పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించిన పీవీ సింధు 21-15, 21-13 రూపంలో వరుస సెట్లలో విజయం సాధించింది. ఈ క్రమంలో క్వార్టర్‌ ఫైనల్స్‌ లో అడుగుపెట్టిన పీవీ సింధు, టోక్యో ఒలింపిక్స్‌ లో భారత్ పతక ఆశల్ని మోస్తున్న ఏకైక షట్లర్‌‌గా ఉంది. బ్లిక్‌ ఫెల్ట్‌ పై పీవీ సింధుకి మెరుగైన రికార్డ్ ఉంది. ఈరోజు మ్యాచ్ ముందు వరకూ ఐదు సార్లు ఈ ఇద్దరు తలపడగా, నాలుగు సార్లు పీవీ సింధు విజయం సాధించింది.

కానీ, ఈ ఏడాది ఆరంభంలో జరిగిన థాయ్‌ లాండ్ ఓపెన్‌ లో పీవీ సింధుపై బ్లిక్‌ ఫెల్ట్‌ గెలుపొంది ఉండటంతో మ్యాచ్ పోటీపోటీగా సాగుతుందని అంతా ఊహించారు. దానికి తోడు పీవీ సింధు కూడా మ్యాచ్‌కి ముందు బ్లిక్‌ ఫెల్ట్‌ చాలా దూకుడుగా ఆడుతుంది. కాబట్టి నేను కూడా దూకుడుగా ఆడాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. కానీ, నాకౌట్ పోరులో బ్లిక్‌ ఫెల్ట్‌ తేలిపోయింది. పీవీ సింధుకి రెండు సెట్లలో కనీస పోటీని కూడా ఆమె ఇవ్వలేకపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌లో ఫైనల్‌ కి చేరిన పీవీ సింధు.. రజత పతకం గెలుపొందిన విషయం తెలిసిందే.

ఇక , ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను దాస్ విజయం సాధించాడు. వ్యక్తిగత విభాగం రౌండ్‌ 32వ మ్యాచ్‌ చైనీస్ తైపీ ఆర్చర్ డెంగ్ యు చెంగ్‌ పై 6-4 తేడాతో గెలిచాడు. తన తర్వాతి మ్యాచ్‌ లో కొరియాతో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

ఒలింపిక్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ ను భారత హాకీ జట్టు మట్టికరిపించింది. టోర్నీ ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనాపై భారత హాకీ జట్టు జయకేతనం ఎగురవేసింది. గురువారం ఉదయం జరిగిన గ్రూప్‌-ఏ నాలుగో మ్యాచ్‌ లో 3-1తో విజయం సాధించింది. మ్యాచ్‌ తొలి క్వార్టర్ ముగిసేసరికి 0-0తో ఇరుజట్లు ఖాతా తెరవలేదు. అయితే మ్యాచ్‌ 43వ నిమిషంలో భారత ఆటగాడు కుమార్‌ వరుణ్‌ తొలి గోల్‌ చేసి జట్టును 1-0తో లీడ్‌లో నిలిపాడు. అయితే కొద్ది సేపట్లోనే (మ్యాచ్‌ 48వ నిమిషంలో) అర్జెంటీనా ఆటగాడు మైకో కసెల్లా తన జట్టుకు తొలి గోల్‌ అందించాడు.

దీనితో ఇరుజట్ల స్కోర్‌ సమం అయ్యింది. కాగా, మ్యాచ్‌ 58వ నిమిషంలో ప్రసాద్‌ వివేక్‌ సాగర్‌ రెండో గోల్‌ చేయడంతో ఇండియన్‌ టీం లీడ్‌లోకి దూసుకెళ్లింది. ఇక 59వ నిమిషంలో హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ మూడో గోల్ చేసి భారత్‌ కు అద్భుత విజయాన్ని అందించాడు. నాలుగో క్వార్టర్‌ లోనే భారత్‌ రెండు పాయింట్లు సాధించడం విశేషం. గ్రూప్‌-ఏ మ్యాచ్‌లలో భారత్‌ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట విజయం సాధించింది. న్యూజిలాండ్‌, స్పెయిన్‌, అర్జెంటీనాపై గెలుపొందగా, ఆస్ట్రేలియా ఓటమి చవిచూసింది. గ్రూప్‌-ఏలో తన ఆఖరి మ్యాచ్ జపాన్‌ తో తలపడనుంది.

ఇక గురువారం ఇన్‌గ్రిట్‌ వెలన్సియా (కొలంబియా)తో స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ (51 కేజీలు) తలపడనుంది. పురుషుల విభాగంలో సతీశ్‌ కుమార్‌ (ప్లస్‌ 91 కేజీలు) తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు.