Begin typing your search above and press return to search.

టోక్యో ఒలంపిక్స్ : 12 వ రోజు హైలెట్స్.. మరో రెండు పథకాలు ఖరారు !

By:  Tupaki Desk   |   5 Aug 2021 4:13 AM GMT
టోక్యో ఒలంపిక్స్ : 12 వ రోజు హైలెట్స్.. మరో రెండు పథకాలు ఖరారు !
X
ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌ ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. ఇప్పటికే అథ్లెట్లు తమ దేశ ప్రజలు గర్వించేలా మెడల్స్ సాధించారు. . బుధ‌వారం జ‌రిగిన‌ 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో క‌జ‌కిస్థాన్ రెజ్ల‌ర్ నూరిస్లామ్ స‌న‌యేవ్‌ పై ర‌వికుమార్‌ గెలిచాడు. విక్ట‌రీ బై ఫాల్‌ గా అత‌న్ని విజేత‌గా ప్ర‌క‌టించారు. ఈ విజ‌యంతో ఫైన‌ల్లో అడుగుపెట్టిన ర‌వికుమార్‌.. ఇండియాకు క‌నీసం సిల్వ‌ర్ మెడ‌ల్ ఖాయం చేయ‌డం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒలింపిక్స్ రెజ్లింగ్‌ లో సుశీల్‌కుమార్‌, యోగేశ్వ‌ర్‌ద‌త్‌ లు మాత్ర‌మే ఇండియాకు సిల్వ‌ర్ మెడ‌ల్స్ అందించారు. వాళ్ల త‌ర్వాత ఈ ఘ‌న‌త సాధించిన మూడో రెజ్ల‌ర్‌గా ర‌వికుమార్ ద‌హియా నిలిచాడు. బుధ‌వారం ఉద‌యం నుంచి ర‌వికుమార్ మొత్తం బౌట్లు గెలిచి మెడ‌ల్ ఖాయం చేయ‌డం విశేషం. సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఒక ద‌శ‌లో ప్ర‌త్య‌ర్థి నూరిస్లామ్ 9-2 లీడ్‌ లోకి దూసుకెళ్లాడు. అయితే ఈ సమ‌యంలో ర‌వికుమార్ అత‌న్ని రింగ్ బ‌య‌ట‌కు తోసే క్ర‌మంలో నూరిస్లామ్ కాలికి గాయ‌మైంది. కాలికి క‌ట్టుకొని మ‌ళ్లీ రింగులోకి వ‌చ్చినా.. అత‌డు ర‌వికుమార్ ప‌ట్టుకు నిలవ‌లేక‌పోయాడు. దీంతో రిఫ‌రీ ర‌వికుమార్‌ ను విక్ట‌రీ బై ఫాల్ కింది విజేత‌గా ప్ర‌క‌టించాడు.

రెజ్ల‌ర్ దీపక్ పూనియా .. సెమీస్‌లో ఓట‌మిపాల‌య్యాడు. 86కేజీల ఈవెంట్‌ లో అమెరికా రెజ్ల‌ర్ డేవిడ్ మోరిస్ టేల‌ర్ చేతిలో దీప‌క్ ఖంగుతిన్నాడు. టెక్నిక‌ల్ సుపీరియార్టీ ప‌ద్ధ‌తిలో టేల‌ర్ 10-0 స్కోర్‌తో మ్యాచ్‌ ను సొంతం చేసుకున్నాడు. అయితే రెజ్ల‌ర్ దీప‌క్‌.. బ్రాంజ్ మెడ‌ల్ కోసం మ‌రో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఆరంభం నుంచి అమెరికా రెజ్ల‌ర్ టేల‌ర్ దూకుడుగా ఆడాడు. దీప‌క్‌ ను ఓ ప‌ట్టుప‌ట్టేశాడ‌త‌ను. మ‌రింత యాక్టివ్‌ గా కావాల‌టూ దీప‌క్‌ ను రెఫ‌రీ కోరాడు. ఆ స‌మ‌యంలో ఇన్‌ యాక్టివ్ క్లాక్‌ తో పాయింట్ల‌ను దీప‌క్ కోల్పోయాడు. ఆ త‌ర్వాత టేల‌ర్‌.. దీప‌క్‌ ను గ‌ట్టిగా ప‌ట్టి కింద‌ప‌డేశాడు. దీంతో అమెరికా రెజ్ల‌ర్ లీడింగ్‌ లోకి వెళ్లిపోయాడు. ఇవాళ ఉద‌యం జ‌రిగిన రెండు మ్యాచుల్లో దీప‌క్ పూనియా విజ‌యం సాధించిన తీరు ఆక‌ట్టుకున్నా, సెమీస్‌ లో మాత్రం అత‌ని ప‌ట్టు నిలువ‌లేక‌పోయింది.

ఒలింపిక్స్ చరిత్రలో మొదటిసారి ఫైనల్‌ కి చేరే సువర్ణావకాశాన్ని భారత మహిళల హాకీ టీమ్ చేజార్చుకుంది. టోక్యో ఒలింపిక్స్‌ లో భాగంగా అర్జెంటీనాతో బుధవారం తలపడిన భారత మహిళల హాకీ టీమ్ 1-2 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఇక కాంస్య పతకం కోసం గ్రేట్ బ్రిటన్‌తో శుక్రవారం భారత్ ఢీకొట్టనుంది. మ్యాచ్ ఆరంభంలోనే గుర్జీత్ కౌర్ గోల్ కొట్టి భారత్ జట్టులో ఉత్సాహం నింపింది. 2వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ ని కౌర్‌ గోల్‌ గా మలిచింది. కానీ.. 18వ నిమిషంలో గోల్ చేసిన మారియా భారత ఆధిక్యాన్ని 1-1తో సమం చేసింది. ఇక అక్కడి నుంచి మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. భారత్ గోల్ పోస్ట్‌ పై పదే పదే దాడులు చేసిన అర్జెంటీనా, ఎట్టకేలకి 36వ నిమిషంలో మరో గోల్ కొట్టి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మారియా మరోసారి పెనాల్టీ కార్నర్‌ ని గోల్‌ గా మలిచింది. దాంతో భారత్ జట్టు ఒత్తిడిలోకి వెళ్లిపోగా,. చివర్లో ప్లేయర్ల మధ్య సమన్వయం కూడా లోపించింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో ఆరు జట్లు మాత్రమే పోటీపడగా.. రౌండ్ రాబిన్ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. ఆ ఒలింపిక్స్‌ లో టాప్-4లో నిలిచిన భారత మహిళల హాకీ టీమ్.. ఒలింపిక్స్‌ లో పోటీపడుతుండటం ఇది మూడోసారి మాత్రమే. 1980 ఆ తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌లో మాత్రమే భారత మహిళల హాకీ టీమ్ పోటీపడింది.

టోక్యో ఒలింపిక్స్‌ లో భారత ఫురుషుల హాకీ టీమ్ కాంస్య పతకం గెలుపొందింది. జర్మనీతో గురువారం జరిగిన కాంస్య పతక పోరులో భారత్ జట్టు 5-4 తేడాతో విజయాన్ని అందుకుంది. 1980 ఒలింపిక్స్‌ లో చివరిగా పతకం గెలిచిన భారత ఫురుషుల హాకీ టీమ్ ఎట్టకేలకి 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పతకం కరవుని తీర్చింది. టోక్యో ఒలింపిక్స్‌ లో భారత్‌ కి ఇప్పటికే వెయిల్‌ లిప్టర్ మీరాబాయి చాను రజత పతకాన్ని అందివ్వగా.. స్టార్ షట్లర్ పీవీ సింధు, బాక్సర్ లవ్లీనా కాంస్య పతకాలు అందించారు. తాజాగా హాకీ టీమ్ కాంస్య పతకంతో భారత్ పతకాల సంఖ్య నాలుగుకి చేరింది.

టోక్యో ఒలిపింక్స్‌లో భారత మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్ శుభారంభం చేసింది. 53 కిలోల విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌ కు చేరింది. తొలి రౌండ్‌ లో స్వీడన్ రెజ్లర్ సోఫియా మాట్సన్‌ సోఫియాను 7-1 తేడాతో మట్టికరిపించింది. వినేశ్ ఫోగట్ మ్యాచులో ప్రత్యర్థిపై ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. దూకుడుగా ఆడుతూ పాయింట్లు సాధించింది. తొలి పిరియడ్‌ లో 2, 2, 1 స్కోరు సాధించిన ఆమె రెండో పిరియడ్‌ లో స్కోరు 2 మాత్రమే సాధించింది. ప్రత్యర్థి మాట్సన్‌ కేవలం ఒకే పాయింట్‌ సరిపెట్టుకున్నది. తరువాతి మ్యాచ్‌ లో వినేశ్ బెలారస్‌ కు చెందిన వనేసా కలడ్జింసక్యాతో తలపడనుంది. మరో రెజ్లర్‌ అన్షు మాలిక్ మహిళల 57 కేజీల విభాగంలో రీపేజ్ రౌండ్‌లో ఓడిపోయింది. రష్యాకు చెందిన రెజ్లర్‌ వలెరియా చేతిలో 1-5 తేడాతో అన్షు ఓటమిపాలైంది. అన్షు మంచి డిఫెన్స్ చూపించినప్పటికీ పరాజయం తప్పలేదు.