Begin typing your search above and press return to search.

ఇదో హైటెక్ బురద బార్ బాసూ!

By:  Tupaki Desk   |   2 Aug 2016 11:08 AM IST
ఇదో హైటెక్ బురద బార్ బాసూ!
X
సాదారణంగా బార్ లు అంటే ఎలా ఉంటాయి.. ఏ రకమైన బార్ లపై ఎక్కువమంది ఆసక్తిని కనబరుస్తారు? వీలైనంత శుభ్రంగా ఉండాలి - సర్వీస్ ఫాస్ట్ గా ఉండాలి.. బార్ లోకి వెళ్తే రిం జిం లైట్లతో జిమ్మిక్కులు గొలిపే వాతావరణం ఉండాలి! ఇవే కదా ఎక్కువమంది ఆప్షన్స్. కానీ ఇప్పుడు చెప్పబోయే బార్ లో అలాంటివేమీ ఉండవు సరికదా, ఫుల్ గా బురద ఉంటుంది. అలా అని ఆ బురద పక్కన కూర్చుని కానిచ్చేద్దామంటే కుదరదు - ఆ బురదలో కూర్చుని మద్యం సేవించాలి. ఇది కూడా మద్యపాన ప్రియుల ఆరోగ్యం కోసమేనట!

రండి.. బురదలో కుర్చుని మీకు ఇష్టమైన మద్యాన్ని సేవించండి అంటున్నారు జపాన్ వ్యాపారవేత్తలు. జపాన్ లో కొత్తగా ఇలాంటి బురద బార్ ఒకటి ప్రారంభించారు. టోక్యోలో కొత్తగా ప్రారంభమైన ఈ బార్ ను చాలా విచిత్రంగా ఏర్పాటు చేశారు. ఈ బార్ లో విశాలమైన ఓ పెద్ద టబ్ ఉండి - అందులో నిండా బురద ఉంటుంది. ఈ బురదలో కుర్చుని మద్యం సేవించడమే దీని ప్రత్యేకత. ఈ బార్ నిర్వాహకులు.. మీకు ఇష్టమైన మద్యం సేవిస్తూ బురదలో సేదతీరవచ్చు అని చెబుతున్నారు. అదేమి చోద్యంరా బాబూ అనుకోవద్దు.. ఎందుకంటే ఈ బురదలో సముద్రంలో దొరికే ఖనిజ లవణాలు కలిసి ఉన్నాయట.

ఈ బార్ లో మద్యం కొన్నవారు ఒక గంటపాటు హాయిగా ఈ బురదలో సేదతీరవచ్చు. మద్యం సేవించిన అనంతరం స్నానం చేసి, దుస్తులు మార్చుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. మత్తుకు మత్తు - ఆరోగ్యానికి ఆరోగ్యం అని భావించిన యువతీ యువకులు ఈ బార్ లకు క్యూలు కడుతున్నారట.