Begin typing your search above and press return to search.

`అమ‌రావ‌తి` గురించి నేటి త‌రానికి ఇక తెలియ‌దు.. ఏం జ‌రిగిందంటే!

By:  Tupaki Desk   |   6 Oct 2021 8:08 AM GMT
`అమ‌రావ‌తి` గురించి నేటి త‌రానికి ఇక తెలియ‌దు.. ఏం జ‌రిగిందంటే!
X
న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్‌ రాజ‌ధాని అమ‌రావ‌తి! ఇప్ప‌టి వ‌ర‌కు ఇంతే. అయితే.. మూడురాజ‌ధానుల ను ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించినా.. దీనిపై కోర్టుల్లో కేసులు న‌డుస్తున్నాయి. దీంతో అమ‌రావ‌తినే రాజ‌ధానిగా పేర్కొంటున్నారు సామాన్య ప్ర‌జ‌లు. కానీ, అమ‌రావ‌తిని అన్ని రూపాల్లోనూ నాశ‌నం చేస్తున్న‌ద‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న వైసీపీ ప్ర‌భుత్వం.. ఇప్పుడు తాజాగా తీసుకున్న కొత్త నిర్ణ‌యం మేర‌కు ప్ర‌స్తుత త‌రానికి ఇక‌, అమ‌రావ‌తి అంటే ఏంటో దీనిని ప్రాధాన్యం.. విశేషాలు.. ఎందుకు అమ‌రావ‌తినే మ‌న రాజ‌ధానిగా ఎంపిక చేయాల్సి వ‌చ్చిందో.. వంటి కీల‌క విష‌యాలు తెలిసే అవ‌కాశం లేకుండా చేసింది వైసీపీ ప్ర‌భుత్వం.

వాస్త‌వానికి వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి అమ‌రావ‌తిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది. అమ‌రావ‌తిలో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ న‌డిచింద‌ని.. ఒక సామాజిక వ‌ర్గం కోస‌మే దీనిని ఏర్పాటు చేశార‌ని.. త‌ర‌చుగా చెప్పే పాల‌కులు.. కోర్టుల నుంచి ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌నే ఆన‌వాలు క‌నిపించ‌లేదని స్ప‌ష్టం చేసినా.. త‌మ వ్యూహాన్ని మాత్రం అమ‌లు చేస్తున్నారు. గ‌త టీడీపీ హ‌యాంలో విభ‌జ‌న క‌ష్టాల్లో ఉన్న ఏపీకి స‌మున్న‌త‌మైన రాజ‌ధాని న‌గ‌రం కావాలంటూ.. అప్ప‌టి ముఖ్యమంత్రి చంద్ర‌బాబు 33 వేల ఎక‌రాల‌ను స‌మీక‌రించి.. దీనికి పునాదులు వేశారు.

అయితే.. కొత్త రాజ‌ధానికి అన్ని రూపాల్లోనూ ప్ర‌చారం క‌ల్పించాల‌ని.. ఆయ‌న త‌ల‌పోశారు. ఈ క్ర‌మంలో నే.. నేటి విద్యార్థుల‌కు కూడా అమ‌రావ‌తి ప్రాధాన్యం తెలియ జెప్పేలా.. ఆయ‌న ప్ర‌ణాళిక వేసుకుని.. తెలుగు పాఠ్య పుస్త‌కంలో రెండో పాఠంగా అమ‌రావ‌తిని చేర్చారు. పిన్న వ‌య‌సు నుంచే రాజ‌ధానిపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం.. అమ‌రావ‌తి ప్రాధాన్యం తెలియ‌జేయ‌డం వంటి అంశాల‌కు ఆయ‌న ప్రాధాన్యం ఇచ్చారు. 10వ త‌ర‌గ‌తివిద్యార్థుల‌కు రెండో పాఠ్యాంశంగా దీనిని చేర్చి.. రాజ‌ధాని విశేషాల‌ను వారికి వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. న‌ర‌న‌రానా.. అమ‌రావ‌తిపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం.. ప్ర‌ధాన ఉద్దేశం.

అయితే.. వైసీపీ స‌ర్కారు హ‌యాంలో అమ‌రావ‌తిని.. ప‌క్క‌న పెట్టిన విష‌యం తెలిసిందే. తీసివేత‌లు.. కూల్చివేత‌ల‌తో అమ‌రావ‌తిని అణిచి వేసే ప్ర‌క్రియ‌.. ముమ్మ‌రంగా సాగిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్పుడు ప‌దో త‌ర‌గ‌తి రెండో పాఠంగా ఉన్న అమ‌రావ‌తి పాఠ్యాంశాన్ని తొల‌గించారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అమ‌రావ‌తి వైభ‌వాన్నివివ‌రించి.. విద్యార్థుల్లో రాజ‌ధానిపై ఆస‌క్తిని పెంచిన ఈ పాఠం .. కొత్త‌గా ఈ ఏడాది నుంచి అమ‌ల్లోకి వ‌స్తున్న పాఠ్యాంశాల్లో తీసేశారు. దీనికి సంబంధించి కొత్త పుస్త‌కాల‌ను కూడా ముద్రించారు.

ఈ పుస్త‌కాల్లో అమ‌రావ‌తి పాఠం తొలగించి.. కేవ‌లం 10 పాఠ్యాంశాల‌తోనే తెలుగు పుస్త‌కాలు రెడీ చేశారు. పాత పుస్త‌కాల‌ను విద్యార్థుల‌నుంచి తీసేసుకుని.. కొత్త పుస్త‌కాలు ఇవ్వ‌నున్నారు. అయితే.. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. స‌ద‌రు పాఠ్యాంశాన్ని తొల‌గిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ముందుగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. పైగా పుస్త‌కాల పంపిణీలో ఆల‌స్యం జ‌రిగింది. దీంతో ఈ ఏడాది విద్యార్థుల‌కు ఉపాధ్యాయులు పాత సిల‌బ‌స్ మేర‌కే అమ‌రావ‌తిని బోధించారు. అయితే.. ప‌రీక్ష‌ల్లో మాత్రం దీనిని ప్ర‌స్తావించే అవ‌కాశం లేదు. ఏదేమైనా.. అమ‌రావ‌తిలో ర‌హ‌దారులు ధ్వంసం చేయ‌డం.. అమ‌రావ‌తిలో భూకంపాలు వ‌స్తాయ‌ని ముద్ర‌వేయ‌డం.. కృష్ణాన‌దికి వ‌చ్చే వ‌ర‌ద‌ల‌తో మునిగిపోతుంద‌ని ప్ర‌చారం చేయ‌డం ద‌రిమిలా.. ఇప్పుడు పాఠ్యాంశాన్ని కూడా తొల‌గించ‌డం.. సంచ‌ల‌నంగా మారింది.