Begin typing your search above and press return to search.

వంగ‌వీటి నిర్ణ‌యం నేడే: బెజ‌వాడ‌లో ఉత్కంఠ‌!

By:  Tupaki Desk   |   26 Dec 2018 8:04 AM GMT
వంగ‌వీటి నిర్ణ‌యం నేడే: బెజ‌వాడ‌లో ఉత్కంఠ‌!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌కు మూల‌ కేంద్ర‌మైన విజ‌య‌వాడ‌లో బుధ‌వారం ఉత్కంఠ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత వంగ‌వీటి రాధా ఈ ఉత్కంఠ‌కు కేంద్ర బిందువుగా నిలిచారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయన ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నేది నేడు తేల‌నుంది. దీంతో వంగ‌వీటి రంగా అభిమానులంతా రాధా ప్ర‌క‌ట‌న కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

వంగ‌వీటి రంగా మ‌ర‌ణించిన నేటికి స‌రిగ్గా 30 ఏళ్లు. ఈ సంద‌ర్భంగా రంగా స్వ‌గ్రామం కాటూరులో 30 ఎక‌రాల్లో ఆయ‌న స్మార‌కాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క‌ కార్య‌క్ర‌మం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని రంగా ఫ్యాన్స్ కు ఆహ్వానం అందింది. దీంతో వేలాదిమంది అభిమానులు న‌గ‌రానికి త‌ర‌లివ‌చ్చారు. ఈ కార్య‌క్ర‌మంలోనే వంగ‌వీటి రాధా త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశ‌ముంది. దీంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్నాడో వంగ‌వీటి రాధా బుధ‌వారం ప్ర‌క‌టించే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. రాధా 2009లో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ స్థానం నుంచి - 2014లో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. రెండు సార్లూ ఓట‌మి చ‌విచూశారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ఆయ‌న చాలా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ స్థానం నుంచి బ‌రిలో దిగాల‌ని రాధా భావిస్తున్నారు. కానీ ఆ సీటును వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇప్ప‌టికే మ‌ల్లాది విష్ణుకు కేటాయించారు. మ‌చిలీప‌ట్నం సీటునుగానీ విజ‌య‌వాడ తూర్పు స్థానాన్నిగానీ పోటీకి ఎంచుకోవాల‌ని రాధాకు జ‌గ‌న్ స‌ల‌హా ఇచ్చారు.

అయితే - వైసీపీ అధినేత‌ ప్ర‌తిపాద‌న‌ను అంగీక‌రించేందుకు రాధా ఏమాత్రం సిద్ధంగా లేర‌ని తెలుస్తోంది. బెజ‌వాడ‌ సెంట్ర‌ల్ నుంచే బ‌రిలో దిగాల‌ని ఆయ‌న కృత‌ నిశ్చ‌యంతో ఉన్న‌ట్లు స‌మాచారం. ఆ సీటును త‌న‌కు కేటాయించ‌కుంటే వైసీపీని వీడేందుకు సైతం రాధా వెనుకాడ‌బోర‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌న ప‌లు పార్టీల‌తో సంప్ర‌దింపుల్లో ఉన్నార‌ని కూడా వార్త‌లొస్తున్నాయి. వైసీపీని వీడాల్సి వ‌స్తే రాధా చేరేది ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీలోనేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌క‌ట‌న కోసం అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు.