Begin typing your search above and press return to search.

కేంద్రమంత్రికి పొగాకు సెగ

By:  Tupaki Desk   |   18 Sep 2015 8:37 AM GMT
కేంద్రమంత్రికి పొగాకు సెగ
X
కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు నిర్మలా సీతారామన్‌ కు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొదవారిపాలెంలో చేదు అనుభవం ఎదురైంది. ఆమెను పొగాకు రైతులు అడ్డుకున్నారు. అప్పులతో ఆత్మహత్యకు పాల్పడిన బొల్లినేని కృష్ణారావు కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వచ్చిన నిర్మలాసీతారామన్ రైతులతో మాట్లాడకుండా తిరుగు ప్రయాణం కావడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన పొగాకు రైతులు ఆమె కాన్వాయ్ కి అడ్డుపడ్డారు. దీంతో మంత్రి రైతులతో మాట్లాడారు.

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా తిరుగుముఖం పట్టడంతో పొగాకు రైతులు అడ్డుకున్నారు. మిగిలిన పొగాకును కొనుగోలుకు హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో ఆమె వెంటనే వారితో మాట్లాడారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అంతకుముందు ఆమె ఒంగోలులోని పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పొగాకు కొనుగోళ్లలో వ్యాపారుల మాయాజాలంపై పలువురు రైతులు మంత్రికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె పొందూరులో పర్యటించినప్పుడు పొగాకు కొనుగోళ్లపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా వెళిపోతున్నారంటూ రైతులు అడ్డుకున్నారు. అనంతరం ఆమె కొండసముద్రం గ్రామరైతు నీలం వెంకట్రావు కుటుంబాన్ని పరామర్శించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ వెంకట్రావు తల్లిదండ్రులను, భార్యను ఆమె ఓదార్చారు. బాధిత కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు తాను బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చానని ఆమె తెలిపారు. వెంకట్రావు భార్యను వెంటనే అంగన్‌వాడీ కార్యకర్తగా నియమించి జీవనోపాధి కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా రాష్ట్రంలో పొగాకు సంక్షోభం ఉంటే పొగాకు బోర్డు ఛైర్మన్ ఇటలీ వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నిర్మల ఆయనను రెండు రోజుల క్రితం విధుల నుంచి తప్పించిన విషయం తెలిసిందే.