Begin typing your search above and press return to search.

అలా చేయడం ఉన్నతాధికారుల్ని వేధించడమే : సుప్రీం !

By:  Tupaki Desk   |   8 April 2021 2:42 PM IST
అలా చేయడం ఉన్నతాధికారుల్ని వేధించడమే : సుప్రీం !
X
పలు కేసుల్లో ప్రభుత్వ ఉన్నతాధికారుల్ని పదే పదే కోర్టుకి రమ్మని సమన్లు జారీ చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది. కింది కోర్టులు, హైకోర్టులు చీటికి మాటికి ప్రభుత్వ అధికారుల్ని కోర్టుకు హాజరుకావడం సరైన పని కాదని, అలా చేయడం అధికారుల్ని వేధించడం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తెలిపింది. ఉత్తరప్రదేశ్ ‌లోని ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇవ్వాల్సిన వేతన బకాయిలకు సంబంధించిన కేసులో ప్రభుత్వ అధికారులు ఇద్దరు కోర్టుకు హాజరు కావాలంటూ అలహాబాద్‌ సింగిల్‌ జడ్జి తీర్పు చెప్పారు. ఈ కేసులో అంతకు ముందే హైకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత అధికారులపై కోర్టు ధిక్కార చర్యలకు ఆదేశిస్తూ, వారిని కోర్టు ఎదుట హాజరుకావాలని మార్చి 2న అలహాబాద్‌ సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. దీనితో యూపీ సర్కార్‌ ఆ ఆదేశాలను సవాల్‌ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది.

ఆ పిటిషన్‌ ను విచారించిన జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, హేమంత్‌ గుప్తాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలను కొట్టిపారేసింది. స్టే ఉన్న ఒక కేసులో అధికారులు హాజరు కావాలని ఆదేశించడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కోర్టుకి అధికారం ఉందని పదే [పదే ప్రభుత్వ అధికారులని కోర్టుకు రమ్మనకూడదని సుప్రీం కోర్టు తెలిపింది. ఆ అధికారాన్ని వినియోగించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అలహాబాద్‌ హైకోర్టుకి హితవు పలికింది. ఇలా తరచూ అధికారులకి సమన్లు జారీ చేయడం అంటే అనవరంగా వారిని వేధించడ మేనని న్యాయమూర్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.