Begin typing your search above and press return to search.

మోడీ నామినేష‌న్ ర‌ద్దుకు దీదీ డిమాండ్‌..త‌ర్వాతేంటి?

By:  Tupaki Desk   |   1 May 2019 5:14 AM GMT
మోడీ నామినేష‌న్ ర‌ద్దుకు దీదీ డిమాండ్‌..త‌ర్వాతేంటి?
X
గ‌ల్లీ లీడ‌రు నోటికొచ్చిన‌ట్లు మాట్లాడ‌టాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. కానీ.. అత్యున్న‌త స్థానంలో ఉన్న కీల‌క నేత నోటి నుంచి అదే ప‌నిగా వ‌స్తున్న వ్యాఖ్య‌లు ఇప్పుడు దేశ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లాన్ని రేపుతున్నాయి. దేశ ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రిస్తున్న నేత‌.. ఒక రాష్ట్రంలోని 40 మంది ఎమ్మెల్యేలు త‌న‌తో ట‌చ్ లో ఉన్నార‌ని.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డే రోజున ఏం జ‌రుగుతుందో చూడాలంటూ వ్యాఖ్యానించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌ధాని మోడీ నోటీ నుంచి వ‌చ్చిన ఈ వ్యాఖ్య‌ల‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మోడీ వ్యాఖ్య‌లు ఎమ్మెల్యేల కొనుగోలు కింద‌కే వ‌స్తుందంటూ విరుచుకుప‌డుతున్న వారు లేక‌పోలేదు. ఇదిలా ఉంటే.. ప‌శ్చిమ‌బెంగాల్ అధికార‌ప‌క్ష‌మైన తృణ‌మూల్ కాంగ్రెస్ సీరియ‌స్ అయ్యింది.

ప‌శ్చిమ‌బెంగాల్ లోని శ్రీ‌రాంపూర్ లో జ‌రిగిన ఎన్నిక‌ల ర్యాలీలో మోడీ మాట‌ల్ని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తూ.. ఆయ‌న‌పై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. 40 మంది ట‌చ్ లో ఉన్నార‌ని చెప్ప‌టం ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసే ప్ర‌య‌త్నం కింద‌కే వ‌స్తుంద‌ని వారు పేర్కొన్నారు. ఇది రెచ్చ‌గొట్టే ప్ర‌క‌ట‌నే కాదు.. అప్రజాస్వామికంగా వారు అభివ‌ర్ణించారు.

ప్ర‌ధాని మాట‌లు చ‌ట్ట విరుద్ధ‌మ‌ని పేర్కొన్న తృణ‌మూల్.. ప్ర‌ధాన‌మంత్రిస్థాయిలో ఉన్న వ్య‌క్తి ఇలాంటి త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌టం స‌రికాద‌ని మండిప‌డ్డారు. ఎన్నిక‌ల కోడ్ ను ప‌ట్టించుకోకుండా మోడీ మాట్లాడుతున్నారంటూ.. తొలుత పుల్వామా అమ‌ర‌వీరులు.. త‌ర్వాత మ‌తం ఆధారంగా ఓట్లు అడిగార‌ని.. ఇప్పుడు ఎమ్మెల్యేల‌ను కొనుగోలుచేస్తుంద‌ని పేర్కొంటున్న నేప‌థ్యంలో మోడీ నామినేష‌న్ ను ర‌ద్దు చేయాల‌ని ఈసీని కోరింది.

ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళిని ఉల్లంఘించిన మోడీపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తృణ‌మూల్ డిమాండ్ చేస్తున్న నేప‌థ్యంతో.. త‌ర్వాతేం జ‌రుగుతుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ చోటు చేసుకున్న ప‌రిణామాల్ని చూస్తే.. తృణ‌మూల్ కోరిన‌ట్లుగా జ‌రిగే అవ‌కాశాలు లేవ‌నే చెప్పాలి. మ‌హా అయితే.. ఒక సీరియ‌స్ వ్యాఖ్య‌.. లేదంటే మంద‌లింపు.. అది కాదంటే ఒక‌రోజో.. రెండు రోజులో.. అది కూడా కాదంటే మూడు రోజుల ప్ర‌చారంపై బ్యాన్ లాంటివి త‌ప్పించి.. సీరియ‌స్ నిర్ణ‌యాల‌కు చోటు లేద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చిన్న చర్య‌లు కూడా క‌ష్ట‌మేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. వీటి మాట ఎలా ఉన్నా.. ఈసీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.